Hyderabad: చుక్కేసి చిక్కుతే.. అంతే ఇక.. మందుబాబుల బెండు తీస్తున్న పోలీసులు!
ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిపై కేసులు బుక్ చేస్తున్నారు. తాజాగా ఈ వీకెండ్‌లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో ఏకంగా 237 మందిపై కేసులు నమోదు చేశారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. నగరంలో ఎక్కడికక్కడే ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించి.. రూల్స్ బ్రేక్ చేసే వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించి మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికిపోయిన 237 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ జి. నరేందర్ తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన, కేసు వివరాలను వెల్లడించారు.
వాహనాల వారీగా నమోదైన కేసులు
ఈ తనిఖీల్లో మొత్తం 237 కేసులు నమోదుగా అందులో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. వీరిలో 205 ద్విచక్ర వాహనదారులు, 04 ఆటోలు, 28 కార్లు, 00 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిలో బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (BAC) పరీక్షల ఆధారంగా కేసులను వర్గీకరించారు. వీరిలో.. 36 mg – 200 mg/100 ml మధ్య 219 మంది, 201 mg – 300 mg/100 ml మధ్య 05 మంది, 301 mg – 550 mg/100 ml మధ్య 13 మంది పట్టుబడ్డారు. వారందరినీ చట్టపరంగా త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు స్పష్టం చేశారు.
10 ఏళ్ల జైలు శిక్ష హెచ్చరిక
మద్యం తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. ఒకవేళ మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
