AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్లోబల్ సమ్మిట్ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. తెలంగాణ అభివృద్ది దిశగా వెళ్తుందన్నారు.

CM Revanth Reddy: చైనా, జపాన్ లాంటి పెద్ద దేశాలతోనే మాకు పోటీ.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Cm
Venkatrao Lella
|

Updated on: Dec 08, 2025 | 4:38 PM

Share

Global Summit: సోనియా, మన్మోహన్ సారథ్యంలో తెలంగాణ కల సాకారం అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌లో సోమవారం గ్రాండ్‌గా ప్రారంభమవ్వగా.. సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమకు మహాత్మాగాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి అని, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని అన్నారు. 2047 నాటికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నామన్న ఆయన.. ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాట్లు చెప్పారు. విజన్‌ డాక్యుమెంట్‌కు సహకరించినవారికి ధన్యవాదాలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారని, తాము కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నట్లు చెప్పారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ తెలిపారు.

“దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా.ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది. మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం… ప్రజల మద్దతు కోరుతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం… ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం” అని రేవంత్ పేర్కొన్నారు.

“చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలచుకున్నా. గ్వాంగ్‌డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్‌కైనా అతిపెద్దది. 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు… కానీ ఆ విజన్ ను సాధించగలం. ఈ విషయంలో మా టీమ్ కు నేను చెప్పేదొక్కటే.. కష్టంగా ఉంటే, వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తా. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక…ఇవాళ మీరందరూ మాతో చేరారు. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నా. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ” అని రేవంత్ తెలిపారు.