AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు..

సామాన్యుడి కంచం.. ధరాభారంతో బరువెక్కుతోంది. రోజూ తినే అన్నం, పౌష్టికాహారంగా భావించే కోడిగుడ్డు.. ఈ రెండింటి ధరలు షాక్ కొట్టేంతలా పెరిగాయి. గల్ఫ్ వార్ టైమ్‌లో 4 రూపాయలకే దొరికిన గుడ్డు.. ఇప్పుడు 10 రూపాయలైంది. కేజీ బియ్యం రాత్రికి రాత్రే 10 రూపాయలు పెరిగింది. మార్కెట్లో ఈ అనూహ్య ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి? ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు అసలు కొనగలరా, తినగలరా?

ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు..
Chicken Eggs
Shaik Madar Saheb
|

Updated on: Jul 17, 2026 | 9:07 AM

Share

కల్తీ చేయరాని ఏకైక పౌష్టికాహారం కోడిగుడ్డు. కానీ, ఇప్పుడు ఆ గుడ్డు కొనాలంటేనే సామాన్యుడి గుండె దడ పుడుతోంది. ఒకప్పుడు వారంలో నాలుగు రోజులు గుడ్డు తిన్న జనం.. ఇప్పుడు ధరలు చూసి వారానికి రెండు రోజులకు తగ్గించుకుంటున్నారు. గత ఏడాది ఇదే జూన్, జులై నెలల్లో 5 నుంచి 6 రూపాయల లోపు పలికిన గుడ్డు ధర.. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఏకంగా ఎనిమిదిన్నర రూపాయలు.. 9 వరకు పెట్టి కొనాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్క గుడ్డును 10 రూపాయలకు అమ్ముతున్నారు.

గత ఏడాది జూన్, జులై నెలల్లో కోళ్ల ఫారాల దగ్గర హోల్‌సేల్ ధర 4 రూపాయల 90 పైసలు ఉంటే.. రిటైల్ మార్కెట్లో ఐదున్నర నుంచి 6 రూపాయల లోపే ఉండేది. 2 నెలల క్రితం గల్ఫ్ యుద్ధం వేళ ఎగుమతులు నిలిచిపోయి ఫారం రేటు మూడున్నర రూపాయలకు పడిపోగా.. రిటైల్‌లో 4 రూపాయలకే కొన్నారు కస్టమర్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఫారం ధర రికార్డు స్థాయిలో 6 రూపాయల 95 పైసలకు చేరడంతో.. బహిరంగ మార్కెట్లో ఎనిమిదిన్నర నుంచి 10 రూపాయల వరకు అమ్ముతున్నారు.

భారీగా పెరిగిన చికెన్ ధరలు..

ఇదిలాఉంటే.. చికెన్ ధరలు సైతం భారీగా పెరిగాయి.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర స్కిన్ లెస్ రూ. 340 నుంచి 350 వరకు ఉంది. హైదరాబాద్ లో కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.340 వరకు, స్కిన్ తో రూ.300 వరకు విక్రయిస్తున్నారు. లైవ్ బర్డ్ రూ.200 వరకు పలుకుతోంది..  వేసవి ఎండలతో భారీగా కోళ్లు చనిపోవడంతో చికెన్ ధరలు కూడా పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

గుడ్డు, చికెన్ ధరలు ఇలా అమాంతం కొండెక్కడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. గత వేసవిలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రతకు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అధికారికంగా 16 లక్షలు, అనధికారికంగా 20 లక్షలకు పైగా కోళ్లు చనిపోయాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కోటి 30 లక్షలకు పైగా కోళ్లు ఉండగా రోజుకి కోటి వరకు గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. 20 లక్షల కోళ్లు చనిపోవడంతో ఆ ప్రభావం గుడ్ల ఉత్పత్తిపై పడింది. ఇటు తెలంగాణలో 4వేల పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. నాటుకోడి పౌల్ట్రీ పరిశ్రమలు 200 వరకు ఉన్నాయి. ఈ పౌల్ట్రీ పరిశ్రమలలో రోజుకు 3 కోట్ల 90 లక్షల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఏడాది వేసవి తీవ్రత వల్ల తెలంగాణలో 10 శాతం కోళ్లు చనిపోయాయి. సో, రెండు రాష్ట్రాల్లోనూ లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో గుడ్ల ఉత్పత్తి ఘోరంగా పడిపోయింది. దీనివల్లే గుడ్డు ధర ఈ స్థాయిలో పెరిగింది. అంతేకాకుండా.. చికెన్ ధర కూడా రూ.350 వరకు చేరింది.

ఇక రెండో కారణం.. కోళ్ల దాణా ధరలు ఆకాశాన్ని అంటడం. సోయా టన్ను ధర 40 వేల నుంచి 65 వేల రూపాయలకు చేరింది. నూనె తీసిన తౌడు ధర 12 వేల నుంచి 22 వేల రూపాయలకు, మొక్కజొన్న ధర 19 వేల నుంచి 24వేల 500 రూపాయలకు పెరిగింది. దీంతో ఉత్పత్తి వ్యయం భరించలేక పౌల్ట్రీ రైతులు కుదేలవుతున్నారు.

తెలుగు రాష్ట్రాలు దేశంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోనే రోజుకు 3 కోట్ల 90 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. అందులో 50 శాతం స్థానికంగా వినియోగమై, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. హైదరాబాద్, వరంగల్ మార్కెట్లలో ప్రస్తుతం 100 గుడ్ల హోల్‌సేల్ ధర 705 రూపాయల మార్కును తాకింది. ఈ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ హెచ్చరిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us