
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్న ఒక కిలాడీ వ్యక్తి ఉదంతం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమని, భారీ జీతమని నమ్మించి ఒక యువతిని, ఆమె కుటుంబాన్ని మోసం చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిశ్చితార్థం వరకు వెళ్లిన ఈ వ్యవహారం బాధితురాలి అప్రమత్తతతో బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన మధు అనే వ్యక్తి మ్యాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించాడు. తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI)లో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు నమ్మబలికాడు. నమ్మకం కుదరడానికి చర్లపల్లిలో ఉద్యోగం చేస్తున్నట్లు ఒక నకిలీ ఐడీ కార్డును కూడా సృష్టించుకున్నాడు. నిందితుడు సృష్టించిన ఐడీ కార్డు, చెప్పిన విషయాలన్ని నమ్మిన బాధితురాలి కుటుంబం అది నిజమేనని అనుకుంది.
పెళ్లి సంబంధం ఖాయం చేసుకునే క్రమంలో నిందితుడు మొదట రూ. 2 కోట్ల వరకట్నం డిమాండ్ చేశాడు. చివరకు రూ. 1.50 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే నల్గొండలో ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, నిశ్చితార్థం తర్వాత నిందితుడు తన అసలు రూపం బయటపెట్టాడు. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ పేరుతో బాధితురాలిని తన గదికి పిలిపించి, ఆమెపై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూ మానసిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. మధు ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలు రహస్యంగా అతని ఉద్యోగం గురించి ఆరా తీసింది.
ఈ విచారణలో అతను ఎఫ్.సి.ఐ అధికారి కాదని, అంతా నకిలీ ఐడీ కార్డులతో ఆడుతున్న నాటకమని తేలింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే చైతన్యపురి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడి నుంచి పోలీసులు రెండు నకిలీ ఎఫ్.సి.ఐ ఐడీ కార్డులను, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా తన కారుపై “On Government Duty” అని రాసి తిరుగుతూ అధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..