Samatha Kumbh 2024: భగవద్ రామానుజాచార్య, 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు
అగ్నిప్రతిష్ఠాపన కాగానే సమతామూర్తి ఎదురుగా ఉన్న గరుడ ధ్వజం దగ్గరికి శ్రీ దేవనాథ్ స్వామివారు ఋత్వికులతో కలిసి వేంచేసి, గరుడపటాన్ని ఆవిష్కరించారు. దేవాధిదేవుడైన యజ్ఞస్వరూపుడు, యజ్ఞఫలప్రదాత అయిన శ్రీమన్నారాయణుని వాహనమైన గరుత్మంతుని ఒక వస్త్రంపై చిత్రించి, ధ్వజస్తంభంపై ఎగురవేశారు. అనంతరం గరుత్మంతుని పర్యవేక్షణలో ఆ సమయంలో భేరీతాడన పూర్వకంగా సకల దేవతలను ఆహ్వానించారు. ఆయా ..
ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల్లో వార్షికోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. భగవద్ రామానుజాచార్య, 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21న ఉదయం అష్టాక్షరి మంత్ర జపంతో ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రాతస్మరణీయం, యాగశాలలో సేవాకాలం, శాత్తుముఱై నిర్వహించారు. తర్వాత అగ్నిప్రతిష్ట కార్యక్రమం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామివారు భక్తులకు తీర్దప్రసాదం అందించారు. తర్వాత దివ్యసాకేతంలోని రామచంద్రప్రభువుకి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. దివ్యసాకేతం నుంచి ఎస్‌ఓఈ వరకు జరిగిన ఈ వాహన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తర్వాత భక్తులకు పెద్దలు అనుగ్రహ భాషణం చేశారు. పూర్ణాహుతితో ఉదయం కార్యక్రమం పూర్తయింది.
అగ్నిప్రతిష్ఠ
యాగశాలలో అగ్నిప్రతిష్ఠాపనతో నవాహ్నికయాగ కార్యక్రమం శుభారంభమైంది. గతంలో శ్రీశ్రీశ్రీ స్వామి నిర్వహించిన యజ్ఞ కార్యక్రమాలన్నింటిలో అరణిమథనం ద్వారా అగ్నిని ఆవిర్భవింప చేయడం ఓ పద్ధతి. సూర్యకాంతి ద్వారా అగ్నిని ఆవిష్కరించడం మరో పద్ధతి. ఆలయాలలో కానీ వేదవిద్వాంసుల గృహాల్లో ఆరకుండా వెలిగే అగ్నిహోత్రాన్ని గ్రహించి వాడడం మరో పద్ధతి. వీటిని దేనికి దేనికి వాడాలి అనేది స్పష్టంగ ఆగమగ్రంథాలు నిర్దేశించాయి. బ్రహ్మోత్సవాల్లో సూర్యకాంతిద్వారా అగ్నిని పుట్టించి వాడుకోవడమే పద్దతి. ఈ సమతాకుంభ్-2024లో రామానుజ దివాకరుని బ్రహ్మోత్సవాలకి జరిపే యాగానికి దినకరుని దివ్యతేజమే శ్రీస్వామివారి సంకల్పబలంతో హోమాగ్నిగా ఆవిర్భవింప చేశారు. అంటే సూర్యకాంతిని ఒక భూతద్దం ద్వారా కేంద్రీకరించి, 1,2 నిమిషాలలోనే అగ్నిని ఆవిర్భవింప చేయడం ఒక అద్భుతం. ఈ అగ్నినే 9 కుండాలలో విస్తరింపచేసి, యాగం మహాపూర్ణాహుతి అయ్యే వరకు సంరక్షించుకుంటూ హోమాలు చేస్తారు.
ధ్వజారోహణం:
అగ్నిప్రతిష్ఠాపన కాగానే సమతామూర్తి ఎదురుగా ఉన్న గరుడ ధ్వజం దగ్గరికి శ్రీ దేవనాథ్ స్వామివారు ఋత్వికులతో కలిసి వేంచేసి, గరుడపటాన్ని ఆవిష్కరించారు. దేవాధిదేవుడైన యజ్ఞస్వరూపుడు, యజ్ఞఫలప్రదాత అయిన శ్రీమన్నారాయణుని వాహనమైన గరుత్మంతుని ఒక వస్త్రంపై చిత్రించి, ధ్వజస్తంభంపై ఎగురవేశారు. అనంతరం గరుత్మంతుని పర్యవేక్షణలో ఆ సమయంలో భేరీతాడన పూర్వకంగా సకల దేవతలను ఆహ్వానించారు. ఆయా దేవతలకు ప్రీతి కలిగించే రాగాలతో, ప్రత్యేకమైన తాళగతులతో భక్తుల హృదయాలను ఆనంద తరంగితం చేసింది. ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి మన దివ్యసాకేత రాముడు సూర్యప్రభ వాహనంపై వేంచేసి కార్యక్రమ పెద్దగా ఉండి, శుభారంభం కావించాడు. ఈ గరుడపటావిష్కరణ సందర్భంలో ఒక విశేష ప్రసాదాన్ని ముద్దలుగా చేసి ఎగురవేస్తూ నివేదన చేశారు. ఇది చాలా శక్తివంతమైనది. సర్పదోషాలున్న వారికి, సంతానంలేని స్త్రీలకి ఈ ప్రసాదం ఆ దోషాన్ని పోగొడుతుందని, వివరిస్తూ శ్రీస్వామివారే సంతానార్థులైన దంపతులకు స్వయంగా ఈ ప్రసాదాన్ని అనుగ్రహించారు. మధ్యాహ్నం స్వాగతాంజలి కార్యక్రమంలో భాగంగా జీవా ఆశ్రమ నాట్యాచార్యులు ఘంటసాల పవన్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన నిర్వహించారు. వెయ్యి మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల పవన్ మాట్లాడుతూ..ఈసారి పదివేల మంది విద్యార్థులతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పుతామని చెప్పారు. తర్వాత శ్రీమతి భావన పెద్దప్రోలు శిష్య బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆ తర్వాత సంగీత దర్శకులు పడాల తారకరామారావు బృందం భక్తి సంగీత విభావరి కార్యక్రమం ఆకట్టుకుంది. త్రిదండి చినజీయర్ స్వామివారు చిన్నారులకు మంగళశాసనాలు అందజేశారు. అనంతరం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ చేశారు. సాయంత్రం 18 దివ్యదేశాధీశులకు గరుడ సేవలు నిర్వహించారు.
18 దివ్యదేశాధీశులకు గరుడసేవల వివరాలు:
1.శ్రీరంగం
2.ఉఱైయూర్/నిచుళాపురం
3. పుళ్ళంపూతంగుడి
4. అన్బిల్/ప్రేమపురి
5. కరంబనూర్/ఉత్తమర్ కోయిల్
6. తిరువెళ్ళరై/పంచసారక్షేత్రం
7. తంజమామణికోయిల్/తంజావూర్
8. తిరుప్పేర్ నగర్/కోయిలడి/అప్పక్కుడత్తాన్
9. తేరళుందూర్/తిరువళుందూర్
10. ఆదనూర్
11. శిరుపులియూర్
12. తిరుచ్చేరై
13. తలైచ్చెంగనాణ్మదియం
14. కుంభకోణం /తిరుక్కుడందై
15. తిరుక్కండియూర్
16. ఒప్పిలియప్పన్/ తిరువిణ్ణగర్
17. తిరువాలి-తిరునగరి
18. తిరుక్కణ్ణపురం
తొలుత సాకేత రామచంద్రప్రభువుకు శేషవాహన సేవ నిర్వహించారు. రామచంద్రప్రభు, సీతమ్మవారు శేషవాహనంపై ఊరేగగా, రామానుజాచార్యుల వారు హంస వాహనంపై విహరించారు. అనంతరం 18 గరుడ వాహన సేవలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ కు చెందిన స్వామి నారాయణ్ ట్రస్ట్ పెద్దలు, ఆధ్యాత్మికగురువు రాకేష్ ప్రసాద్ పాండే తమ పరివారంతో కలిసి పాల్గొన్నారు. రాకేష్ ప్రసాద్ గారికి చినజీయర్ స్వామివారు మంగళశాసనాలు అందించారు. తర్వాత 18 గరుడ వాహనాలను యాగశాలకు తీసుకొచ్చి పూర్ణాహుతి జరిపించారు. అనంతరం తీర్థప్రసాద గోష్ఠి పూర్తయ్యాక గరుడ వాహనాలను తిరిగి ఆలయాలకు చేర్చారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి