Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఏపీ, తెలంగాణలో సమ్మర్ సీజన్ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం ఎండల తీవ్రత .. సాయంత్రానికి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా.. ఉత్తర తెలంగాణలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం పడింది. దాంతో.. ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిపోయింది. ఉదయం ఎండలు కాస్తుండగా.. సాయంత్రానికి ఈదురుగాలలతో భారీ వర్షం కురుస్తుండడంతో ధాన్యం తడిసిపోతోంది. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. ధాన్యం రాశులపై టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ గాలులకు కొట్టుకుపోయి వడ్లు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 11 జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మూడు రోజులపాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ప్రకటించింది.
బుధవారం ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అటు.. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను వర్షాలు వీడడంలేదు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఒకవైపు ఎండ, మరోవైపు వాన పడడం ఆశ్చర్యం కలిగించింది.
బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, గంగవరం మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
