భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న తప్పు ఇదే..
మన సంప్రదాయంలో మంగళసూత్రాలు, గాజులు, మెట్టెలు కేవలం అలంకారాలు మాత్రమే కాదు.. అవి ఒక స్త్రీ సౌభాగ్యానికి చిహ్నాలు. అయితే కాలక్రమేణా భర్త మరణించిన తర్వాత ఆ ఆభరణాల విషయంలో అనేక సందేహాలు, భయాలు చాలామందిని వెంటాడుతుంటాయి. మంగళసూత్రాలను ఏం చేయాలి? చనిపోయిన వారు వాడిన బంగారానికి దోషం ఉంటుందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ సంస్కృతిలో ఆభరణాలకు, ముఖ్యంగా మంగళసూత్రాలు, గాజులు, మెట్టెలకు ఎంతో సెంటిమెంట్ ఉంటుంది. అయితే భర్త మరణానంతరం వాటిని ఏం చేయాలి? వాటిని ఎవరు తీసుకోవాలి? బంగారానికి దోషం ఉంటుందా? వంటి అనేక సందేహాలు చాలామందిని వెంటాడుతుంటాయి. ఈ విషయాలపై జ్యోతిష్య పండితులు కీలక విషయాలు వెల్లడించారు. చాలామంది చనిపోయిన వారు వాడిన నగలు వేరొకరు ధరిస్తే దోషం ఉంటుందని భయపడతారు. కానీ బంగారానికి ఎటువంటి దోషం ఉండదని స్పష్టం చేశారు. బంగారం రూపం మారినప్పుడు దానికి అంటుకున్న ఏ దోషమూ మరొకరికి సంక్రమించదని ఆమె తెలిపారు. కేవలం అక్రమ పద్ధతుల్లో సంపాదించిన బంగారం వల్ల నైతిక సమస్యలు వస్తాయి తప్ప, సహజంగా బంగారానికి ఎటువంటి అపవిత్రత ఉండదు.
మంగళసూత్రాలు: ఏం చేయాలి?
మంగళసూత్రాల విషయంలో ఉండే సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని పండితులు కొన్ని సూచనలు చేశారు..
- మంగళసూత్రంలోని బిళ్లలను తీసి ఉంగరాలుగా మార్చుకుని ధరించవచ్చు.
- ఆ బంగారాన్ని కలిపి కొత్త గొలుసుగా చేయించుకోవచ్చు.
- ఎవరైనా తీసుకోవడానికి ఇష్టపడని పక్షంలో వాటిని మెరుగు పెట్టించి ఆలయాల్లోని అమ్మవారికి సమర్పించడం ఉత్తమ మార్గం.
గాజులు, మెట్టెలు – పట్టీలు
గాజులు: మట్టి గాజులను సాధారణంగా తీసివేస్తారు. కానీ బంగారు గాజులు ధరించడంలో ఎటువంటి అభ్యంతరం లేదని, వాటిని తీయాల్సిన అవసరం లేదని పండితులు నొక్కి చెప్పారు.
మెట్టెలు: సంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన పదవ రోజున మెట్టెలను తీసి చాకలికి ఇచ్చే ఆచారం ఉంది.
పట్టీలు: పాదాలకు ధరించే పట్టీలు చిన్నప్పటి నుంచి ఉండేవి కాబట్టి వాటిని తీయాల్సిన పని లేదు.
ఆభరణాల పంపకాలు
ఆభరణాల పంపకంలో ఎటువంటి కఠిన నిబంధనలు లేవని, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ముఖ్యమని తెలిపారు.
తల్లి సొమ్ము: పుట్టింటి నుంచి తెచ్చుకున్న నగలు కూతుర్లకు ఇవ్వడం ఒక ఆచారం.
అత్తగారి నగలు: అత్తగారు పెట్టిన నగలు కోడలికి చెందాలి. ఆ తర్వాత ఆమె తన కోడలికి బహుకరించాలి.
వయసు పైబడిన తర్వాత బతికి ఉండగానే ఏ నగ ఎవరికి చెందాలి అనేది స్పష్టంగా తెలియజేయడం వల్ల కుటుంబంలో గొడవలు రాకుండా ఉంటాయని పండితులు సూచించారు.
మనుషులు శాశ్వతం కాదని, వయస్సు మీద పడిన తర్వాత ప్రతి రోజూ ఒక బోనస్ లాంటిదని ఆమె గుర్తు చేశారు. బంగారం కోసం గొడవపడి చెడ్డపేరు తెచ్చుకోకుండా పెద్దలు చేసిన సూచనలు పాటిస్తూ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.
