AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇన్‌స్టా ప్రియుడి కోసం ఇల్లు వదిలి వెళ్లిన బాలిక.. చెత్తకుప్పలో కుళ్లిన స్థితిలో డెడ్ బాడీ!

ఆన్‌లైన్‌ ప్రేమకు ముక్కుపచ్చలారని బాలిక బలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మాయగాడు ప్రేమ పేరుతో నమ్మబలికి బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నయవంచన చేసి, చివరకు బాలిక ప్రాణాలు తీశాడు.. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకున్నాడు. కానీ చేసిన పాపం వెంటాడటంతో దొరికిపోయాడు..

Hyderabad: ఇన్‌స్టా ప్రియుడి కోసం ఇల్లు వదిలి వెళ్లిన బాలిక.. చెత్తకుప్పలో కుళ్లిన స్థితిలో డెడ్ బాడీ!
Miyapur Girl Missing Case
Vidyasagar Gunti
| Edited By: Srilakshmi C|

Updated on: Nov 19, 2024 | 7:11 PM

Share

మియాపూర్, నవంబర్‌ 19: మియాపూర్‌లో 17ఏళ్ల బాలిక మిస్సింగ్‌ కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బాలిక ఇల్లు వదిలి అతడి వద్దకు వెళ్లింది. కొన్నాళ్లు సహజీవనం చేశాక.. పెళ్లి ప్రస్తావన రావడంతో.. ఆమెను చంపేసి నిర్మానుష్య ప్రాంతంలో చెత్తకుప్పల్లో విసిరేశాడు ప్రియుడు. తుక్కుగూడలోని ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమ వద్ద బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతి, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..

మియాపూర్‌ టీఎన్‌నగర్‌కు చెందిన దంపతుల కుమార్తె (17) ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటోంది. ఏడు నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్‌ వాయించే విఘ్నేశ్‌ అలియాస్‌ చింటూ (22)తో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. 5 నెలల క్రితం వీరిద్దరు ఫలక్‌నుమాలోని ఓ గుడివద్ద కలుసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత మియాపూర్‌ వెళ్లిన విఘ్నేశ్‌ దాదాపు 20 రోజుల క్రితం అంటే అక్టోబరు 20న బాలికను ఉప్పుగూడకు తీసుకెళ్లాడు. విఘ్నేష్‌ ఛత్రినాకలోని హనుమాన్‌నగర్‌లో ఉండే తన స్నేహితుడు సాకేత్‌, కల్యాణి దంపతుల ఇంటికి తీసుకెళ్లాడు. సాకేత్‌ ఉండే ఇళ్లు ఖాళీ చేసి అందరూ మీర్‌పేటలోని శ్రీదత్తనగర్‌లో మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. బాలిక తన స్నేహితులతో ఉంటున్నానని తల్లి, సోదరికి ఫోన్‌లో తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వీరిద్దరూ దాదాపు 10 రోజులపాటు సహజీవనం చేశారు.

తనను పెళ్లిచేసుకోవాలని బాలిక పట్టుబట్టడంతో అద్దె గదిలోనే నవంబర్‌ 8న ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. అయితే తమ ఇళ్లకి వెళ్లి పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి జరగాలని బాలిక కోరడంతో విఘ్నేష్‌ తప్పించుకుంటూ తిరగసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 8న సాకేత్‌ ఇంట్లోలేని సమయంలో బాలికతో విష్నేష్‌ గొడవ పడ్డాడు. గొడవ ముదరడంతో తలను గోడకు కొట్టి దారుణంగా హత్య చేశాడు. చంపేశాడు. అనంతరం ఇంటికి వచ్చిన సాకేత్‌, కళ్యాణి సహాయంతో బాలిక మృతదేహాన్ని శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో పడేశారు. ఎవరికి కనిపించకుండా చెత్తతో కప్పేసి వెళ్లిపోయారు. నవంబర్‌ 9న బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా మీ బిడ్డ ఇంటికి వచ్చిందా అని విఘ్నేశ్‌ ఫోన్‌లో అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు మియాపూర్‌ పోలీసులకు నవంబర్‌ 10న ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు కథ బయటపడింది. విఘ్నేశ్‌ను అరెస్ట్‌ చేసి, విచారించగా నేరం అంగీకరించారు. ఓఆర్‌ఆర్‌ సమీపంలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్‌కు సహకరించిన సాకేత్‌, కల్యాణిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.