Hyderabad: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్‌కు లైన్ క్లియర్.. రయ్.. రయ్..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు మూడు గంటల్లోనే చేరుకునేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది. దీని గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే దీని నిర్మాణం మొదలుపెడతామని తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఇక 6 వరుసల రోడ్డు నిర్మించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. ఇవి పూర్తి అయితే కేవలం 2 లేదా మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ విషయాన్ని అసెంబ్లీలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు కోమటిరెడ్డి సమాధానమిచ్చారు. ఈ సందర్బంగా రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై కీలక ప్రకటనలు చేశారు.
ఎలివేటెడ్ కారిడార్
ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నాగ్‌పూర్ తరహాలో డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మించేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో కేంద్రం నుంచి అనుమతి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని, అనుమతి వచ్చాక టెండర్లు ఆహ్వానించి ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది పూర్తైతే కేవలం 3 గంటల్లోనే విజయవాడకు చేరుకోవచ్చని తెలిపారు. డబుల్ డెక్కర్ రోడ్డు కోసం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని వివరించారు. రోడ్లను అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామన్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ మధ్య 65 కాలనీలు ఉండగా.. 12 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు.
ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ
ఇక తుక్కుగూడ-శ్రీశైలం హైవేను ఆరు లైన్ల రోడ్డుగా విస్తరించాలని సభ్యులు కోరారు. శ్రీశైలం హైవేపై అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని నివారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వం రోడ్డు విస్తరణప దృష్టి పెడుతుందన్నారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ దాటాక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు.
