మనల్ని ఎవడ్రా ఆపేదీ..! దర్జాగా బీరు కొడుతూ యాక్టివా డ్రైవింగ్.. వీడియో వైరల్‌తో సీన్ సితారా..!
మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని, అది ప్రాణాంతకమని పోలీసులు నెత్తీనోరూ బాదుకుంటున్నా కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా వాహనం నడుపుతూనే మద్యం సేవిస్తూ రోడ్లపై వెళ్లేవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఘోరమైన నిర్లక్ష్యపు ఘటనే ఒకటి వెలుగుచూసింది.

మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని, అది ప్రాణాంతకమని పోలీసులు నెత్తీనోరూ బాదుకుంటున్నా కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా వాహనం నడుపుతూనే మద్యం సేవిస్తూ రోడ్లపై వెళ్లేవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఘోరమైన నిర్లక్ష్యపు ఘటనే ఒకటి వెలుగుచూసింది. లక్డీకాపూల్ లాంటి రద్దీ ప్రాంతంలో యాక్టివా నడుపుతూనే, దర్జాగా బీర్ తాగుతూ వెళ్లిన ఓ యువకుడి నిర్వాకం సోషల్ మీడియా వేదికగా బట్టబయలైంది. ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన ఖైరతాబాద్ పోలీసులు సదరు యువకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ మహానగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన లక్డీకాపూల్‌లోని ద్వారక హోటల్ జంక్షన్ వద్ద ఈ విస్తుపోయే దృశ్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి యాక్టివా స్కూటర్‌పై వెళ్తూ.. ట్రాఫిక్‌ను ఏమాత్రం లెక్క చేయకుండా ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో బీర్ బాటిల్ ముఖానికి తగిలించుకుని తాగుతూ ప్రయాణించాడు. అతడి పక్కనే వెళ్తున్న ఓ వాహనదారుడు ఈ దారుణమైన సీన్‌ను తన మొబైల్‌లో రికార్డ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. “నగర రోడ్లపై ప్రయాణికుల భద్రత ఎక్కడుంది? ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ నెటిజన్లు సదరు వీడియోను ట్యాగ్ చేస్తూ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.
వీడియో నెట్టింట వైరల్ కావడం, ప్రజా రక్షణకు భంగం కలిగేలా ఆ ప్రవర్తన ఉండటంతో సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఖైరతాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వీడియోలోని విజువల్స్ ఆధారంగా యాక్టివా వాహన నంబరును క్షుణ్ణంగా పరిశీలించారు. వాహన రిజిస్ట్రేషన్ వివరాల సాయంతో నిందితుడు మల్లాపూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు. వెనువెంటనే నిందితుడి ఆచూకీ కనుగొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు లక్ష్మణ్‌ను విచారించగా, తను బీరు తాగుతూ అత్యంత ప్రమాదకర రీతిలో వాహనం నడిపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరించినందుకు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందుకు గాను ఖైరతాబాద్ పోలీసులు లక్ష్మణ్‌పై ఐపీసీ, బీఎన్‌ఎస్ తో పాటు మోటార్ వాహనాల చట్టంలోని వివిధ కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తీవ్రమైన నేరమని, కేవలం తనిఖీల్లోనే కాకుండా ఇలా సోషల్ మీడియా సమాచారంతో కూడా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఇలాంటి ప్రమాదకర చర్యలను ఎక్కడ గమనించినా వెంటనే సోషల్ మీడియా ద్వారా లేదా నేరుగా పోలీసుల వాట్సాప్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
