Hyderabad: మెకానిక్ టు అక్రమ భవనాల బిల్డర్.. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో సాజిద్ ఖాన్ అరెస్ట్..
హైదరాబాద్ ఐటీ కారిడార్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల అక్రమ భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు చిన్న మెకానిక్‌గా జీవితం మొదలుపెట్టి, అధికారుల అండదండలతో అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించిన బిల్డర్ సాజిద్ ఖాన్ బాగోతం ఈ ప్రమాదంతో బట్టబయలైంది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ సస్పెండ్ చేయడంతో పాటు సాజిద్‌ను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భారీ భవనం కుప్పకూలిన దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం వేగంగా స్పందించి కఠిన చర్యలు ప్రారంభించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి, నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోనందుకు మాదాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్‌కుమార్‌ను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఘటనకు బాధ్యుడైన బిల్డర్ సాజిద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినందుకు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చిన్న మెకానిక్‌గా జీవితం మొదలుపెట్టిన అతడు.. సైబరాబాద్ ఏరియాలో భారీగా అక్రమ నిర్మాణాలు నిర్మించినట్లు ఉన్నాతాధికారులు గుర్తించారు. అతడికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అతడి అక్రమాలపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది.
మరోవైపు సంఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తూ వాటి కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏడంతస్తుల భవనం కుప్పకూలడంతో పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్ తీవ్రంగా దెబ్బతింది. ఆ నిర్మాణం కూడా ప్రమాదకరంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. దెబ్బతిన్న ఆ అపార్ట్‌మెంట్‌ను సైతం పూర్తిగా కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అందులోని ఉన్నవారిని ఇప్పటికే ఖాళీ చేయించారు. స్థానికులను అప్రమత్తం చేసి పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా అంజయ్యనగర్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎవరినీ ఊపేక్షించేది లేదని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి..
