పాల వ్యాపారం పేరుతో భారీ స్కామ్.. గేదెల పేరుతో 20 కోట్లకు కుచ్చు టోపీ!
కొండపల్లి డెయిరీ ఫారం పేరుతో హైదరాబాద్ లో రూ.20 కోట్ల పెట్టుబడిదారుల మోసం జరిగింది. 500 గేదెలపై పెట్టుబడి పెట్టమని ప్రకటనలు ఇచ్చి, మంచి లాభాలను ఆశించిన 20 మందికి పైగా పెట్టుబడిదారులు మోసపోయారు. అక్రమార్కులు ప్రతి మూడు నెలలకు 37 శాతం వడ్డీ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో రకరకాల కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్యే గాడిదల స్కాం మర్చిపోకముందే ఇప్పుడు తాజాగా గేదెల స్కాం వెలుగులోకి వచ్చింది. మా దగ్గర 500 గేదెలు ఉన్నాయి.. మీరు గేదెలపై పెట్టుబడి పెట్టండి. వచ్చిన ఆదాయంలో 37 శాతం మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తామని సుమారు 20 మంది దగ్గర దాదాపు 20 కోట్ల వరకు దండుకున్నారు అక్రమార్కులు. గేదెల మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఇస్తామంటూ పత్రికా ప్రకటన ఇచ్చి సుమారు 20 కోట్ల మోసానికి పాల్పడిన కొండపల్లి డెయిరీ ఫార్మ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కోకాపేటలో ఉండే వేముల సుబ్బారావు, ఆయన భార్య వేముల కుమారి నాలుగేళ్ల క్రితం అజీజ్ నగర్ లో ‘కొండపల్లి డెయిరీ ఫార్మ్’ ఏర్పాటు చేశారు.
మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడకు చెందిన కీసరి సంజీవరెడ్డి అజీజ్ నగర్ రెవెన్యూలో వ్యవసాయ భూమిని కరీంనగర్ కు చెందిన శ్రీనివాసరావుకు తొమ్మిదేళ్లకు లీజుకు ఇచ్చారు. పొలంలో వ్యవసాయం, పూల పంటలను సాగు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. లీజు సైతం ఆరేళ్లు పూర్తయింది. శ్రీనివాసరావు స్నేహితుడైన కోటేశ్వరరావు ఇక్కడ వ్యవసాయం, పూల పంటల సాగును చూస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం బంధువైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వేముల సుబ్బారావు, కుమారి దంపతులు అజీజ్ నగర్ లోని పొలంలో కొండపల్లి డెయిరీ ఫార్మ్ ను ప్రారంభించారు. సుమారుగా 500 గేదెలను పోషించి రోజుకు 3 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేశారు. లాభాలు బాగానే ఉండగా వ్యాపారంలో అక్రమ మార్గం ఎంచుకున్నారు.
పాడి గేదెలపై పెట్టుబడులు పెడితే మంచి లాభాలు చూపిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెడ్డప్ప కు చెప్పడంతో ఆయన ఓ దినపత్రిక లో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనను చూసి హైదరాబాద్ కు చెందిన 15 మందికి పైగా సుమారు 20 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. పది గేదెలకు 13 లక్షలు పెడితే.. ప్రతినెలా 3 చొప్పున వడ్డీ చెల్లించడంతో పాటు లాభాలు ఇస్తానంటూ పెట్టుబడులు సేకరించారు. రెండు, మూడు మాసాలు వడ్డీ, లాభాలు ఇచ్చాక అజీజ్ నగర్ లోని కొండపల్లి డెయిరీ ఫార్మ్ ఎత్తేశారు. బాధితులు మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించగా సైబరాబాద్ ఆర్థిక నేరాల(ఈవోడబ్ల్యూ) విభాగంలో ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు చెప్పడంతో ఈవోడబ్ల్యూ విభాగంలో బాధితులు ఫిర్యాదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.