
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తేలే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బాక్స్‌లు ఓపెన్ కాబోతున్నాయి. కౌంటింగ్ కోసం ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇంతకీ.. ఎన్ని రౌండ్లలో కౌంటింగ్ ఉండబోతోంది? ఫైనల్ రిజల్ట్ రావడానికి ఎంత టైమ్ పట్టొచ్చు? భద్రతా ఏర్పాట్ల సంగతేంటి? తెలుసుకుందాం.
హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. షేక్‌పేటతో మొదలై ఎర్రగడ్డతో కౌంటింగ్ ముగుస్తుంది. 186 మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. వీరికి అదనంగా ఈసీ అబ్జర్వేషన్ టీమ్ పర్యవేక్షణ ఉంటుందని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు.
నవంబర్ 14వ తేదీన ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో గురువారం యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ మీడియా సెంటర్ లో పాత్రికేయులకు కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో నోటా తో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈసీఐ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గరిష్టంగా 10 రౌండ్ లు చేస్తారని చెప్పారు.
కౌంటింగ్ ప్రక్రియను ఈసీఐ సాధారణ పరిశీలకులు, ఈసీఐ బృందం పరిశీలిస్తారని కణ్ణన్ చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరిలో కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారని అన్నారు. LED స్క్రీన్ ద్వారా, EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ స్పష్టం చేశారు.
కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 250మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు. కౌంటింగ్ కేంద్రం దగ్గరకు గుంపులుగా రావొద్దనీ.. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక జూబ్లీహిల్స్‌లో లక్షా 94వేల 631 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా బోరబండ డివిజన్‌లో 55.92 శాతం.. అత్యల్పంగా సోమాజిగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. 34 కేంద్రాల్లో 60శాతానికిపైగా నమోదైంది. 192 కేంద్రాల్లో 50శాతం మందికిపైగా ఓటేశారు. డివిజన్ల వారీగా చూసుకుంటే బోరబండలో 29వేల 760 మంది.. రహ్మత్ నగర్‌లో 40 వేల 610 మంది.. ఎర్రగడ్డలో 29వేల 112 మంది.. వెంగళ్‌రావు నగర్‌లో 25 వేల 195 మంది.. షేక్ పేట్‌లో 31 వేల 182 మంది.. యూసఫ్‌గూడలో 24వేల 219మంది.. సోమాజీగూడలో 14 వేల 553 మంది ఓటేశారు
అత్యల్పంగా పోలింగ్ నమోదైన కేంద్రాలు షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ డివిజన్లలో ఎక్కువగా ఉన్నట్టు ఈసీ గణాంకాలు చెప్తున్నాయి. 50శాతానికి పైగా పోలింగ్ నమోదైన 226 పోలింగ్ కేంద్రాలే ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..