Kishan Reddy: 40 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు.. హుజూరాబాద్ ప్రజలు మరో చరిత్రను తిరగరాశారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy on Huzurabad by election: దేశంలోనే హుజూరాబాద్ ఉపఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికని.. గత 40 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy on Huzurabad by election: దేశంలోనే హుజూరాబాద్ ఉపఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికని.. గత 40 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పాలక పార్టీ అన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, వాటిని ఖాతరు చేయకుండా బీజేపీని గెలిపించి ప్రజలు.. తెలంగాణ గడ్డ మీద మరో చరిత్ర తిరిగి రాశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయానికి అండగా ఉంటారని నిరూపించారని తెలిపారు. ఈటలను గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు బీజేపీ తరఫున, తన తరఫున కృతజ్ఞతలంటూ పేర్కొన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అనుకున్న విధంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. ఈటల గెలుపు అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల విజయంలో క్రెడిట్ మొత్తం హుజురాబాద్ ప్రజలదేనని తెలిపారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని.. ఈటల తరువాత అత్యధిక గ్రామాలు సందర్శించానని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటలను గెలిపించుకుంటామని ప్రజలు అప్పుడే చెప్పారన్నారు. ఈ ఐదు నెలల కాలంలోనే పొదుపు సంఘాల ఖాతాల్లో వడ్డీ డబ్బులు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను హుజురాబాద్‌లో చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అడిగినవి, అడగనివి కూడా ఇచ్చారని.. హుజురాబాద్ కోసం వేలాది కోట్ల ప్రాజెక్టులు ప్రవేశపెట్టారని తెలిపారు. హుజురాబాద్ ప్రజలు మాత్రం పథకాలు, డబ్బులు, బెదిరింపులు.. వేటికీ లొంగమని చాటిచెప్పారని తెలిపారు.
ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేయలేరేమో, వాళ్లలా వందల కోట్లు ఖర్చు చేయాల్సివస్తుందేమో అని భయపడ్డానన్నారు. అధికార దుర్వినియోగం, నిర్బంధం, ఎన్నికల సిబ్బందిని మభ్యపెట్టే ప్రయత్నాలు అన్నీ జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయినా సరే గెలిపించిన హుజురాబాద్ ప్రజలకే ఈ ఎన్నికల గెలుపు క్రెడిట్ ఇవ్వాలని తెలిపారు. ఈ ఫలితాలు చూసి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సైతం సంతోషపడతారని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనకు, అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలు అనుకుంటే, అభ్యర్థి మీద విశ్వాసం ఉంటే, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, అవి పనిచేయవని నిరూపితమైందన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఓటేశారని తెలిపారు. టీఆర్‌ఎస్ అందరికీ డబ్బు పంచిందని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, ఈటల కూడా ప్రతి కుటుంబాన్ని కలిశారు. టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారని తెలిపారు. తమ కార్యకర్తల మాటలు విశ్వసించి, నోట్ల కట్టల కంటే నైతిక విలువలే ముఖ్యమని ప్రజలు నిరూపించారన్నారు.
హుజురాబాద్‌కు సంబంధం లేని విషయాలపై టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం చేసిందన్నారు. లేని విషయాలను కొండంతలు చేస్తూ, అబద్దాలు, అవాస్తవాలను నాయకులు ప్రచారం చేశారని తెలిపారు. కానీ.. హుజూరాబాద్ ప్రజలు బీజేపీనే ఆశీర్వదించారని.. వారిని ఎంత పొగిడినా తక్కువేనన్నారు. హుజురాబాద్ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. తాను హుజూరాబాద్‌లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఇటలీ నుంచి ఫోన్ చేసి అడిగారని.. గెలుస్తున్నామని అప్పుడే చెప్పానని తెలిపారు. ఎన్నికల్లో ప్రాధాన్యత లేకనే.. ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్లీనరీ పెట్టారని, వరంగల్‌లో సభ అని ప్రకటించారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్లీనరీలో మాట్లాడింది ప్రజలు వింటారు అన్నారు.. హుజురాబాద్ ఎన్నికల కోసమే పథకాలు అని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులను తీసుకుని, ఎమ్మెల్సీ ఇచ్చింది అధికార పార్టీయేనని.. కాంగ్రెస్ తమకెందుకు సహకరిస్తుందంటూ ప్రశ్నించారు.
గతంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. వారికే కాంగ్రెస్ తో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. తెలంగాణ చరిత్రలో హుజురాబాద్ ఎన్నికలకు ఒక పేజీ, ఒక చాప్టర్ ఉంటుందని కిషన్ తెలిపారు. ఈటలను ఎన్ని రకలుగా హింసించారో, ఎన్నిరకలుగా ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు.. ఈ ఎన్నికల్లో హీరోలు ప్రజలు.. హీరో ఈటల రాజేందర్ అంటూ కిషన్ రెడ్డి పేర్కొ్న్నారు.
Also Read: