Huzurabad By-Poll: హుజురాబాద్ బరిలో పోట్లగిత్తలివే.. అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు.. త్రిముఖమేనా?
ఎప్పుడు జరిగినా తాము సర్వం సహా సిద్దమంటూ అధికార టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాలు పన్నడం మొదలు పెట్టారు. కార్యక్షేత్రంలోకి దిగి.. సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఆత్మీయ సమ్మేళనాలు, లోపాయికారీ మంతనాలు... ఇలా ప్రధాన పార్టీలు...
Huzurabad By-poll triangle contest confirm: దాదాపు నాలుగు నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాలకు వేదిక అయిన హుజురాబాద్ ఉప ఎన్నికల ముఖచిత్రం ఆవిష్కృతమైంది. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను వెల్లడించడంతో త్రిముఖ పోటీకి తెరలేచిన సంకేతాలు బలంగా వెలువడ్డాయి. కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత అవమాన భారంతో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో కొనసాగిన పలు రాజకీయ పరిణామాలు.. నేతల మధ్య కొనసాగిన మాటల యుద్ధాలకు పర్యవసానంగా ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి తొలగింపబడడం, ఆ తర్వాత ఆయన భూ కబ్జాలకు, అక్రమాలకు పాల్పడ్డారంటూ విచారణ కొనసాగడం.. అదే క్రమంలో ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యేగిరికి రాజీనామా సమర్పించడం చకచకా జరిగిపోయాయి. జూన్ రెండోవారంలో ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దానిని ఆమోదించి, ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. అప్పట్నించి హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అన్న ఉత్కంఠ కొనసాగింది. ఎప్పుడు జరిగినా తాము సర్వం సహా సిద్దమంటూ అధికార టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాలు పన్నడం మొదలు పెట్టారు. కార్యక్షేత్రంలోకి దిగి.. సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఆత్మీయ సమ్మేళనాలు, లోపాయికారీ మంతనాలు… ఇలా ప్రధాన పార్టీలు తమదైన శైలిలో పట్టు నిలుపుకోవడానికి, పందెంలో నెగ్గడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
నిజానికి 2004 నుంచి కమలాపూర్ నియోజకవర్గంగానీ.. ఆ తర్వాత 2009 నుంచి హుజురాబాద్ నియోజకవర్గంగానీ.. గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది. ఆ పార్టీ తరపున ఈటల రాజేందర్ పలు మార్లు సాధారణ ఎన్నికల్లోను, ఇంకొన్ని సార్లు ఉపఎన్నికల్లోను విజయఢంకా మోగిస్తూ వచ్చారు. అయితే.. రోజులన్నీ ఒకేలా వుండవన్నట్లు.. ఈటల వ్యవహారాలపై గుర్రుగా మారిన గులాబీ దళపతి.. రెండు, మూడేళ్ళుగా కొనసాగుతున్న ఉహాగానాలకు తెరదింపుతూ ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. దీనికి భూకబ్జాలను, భూఆక్రమణలను సాకుగా చూపించి.. వాటిపై విచారణలు కూడా జరిపించారు. ఆ విచారణల పూర్వాపరాలు ఎలా వున్నప్పటికీ.. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారని భావించిన ఈటల రాజేందర్ ఒకదశలో కాస్త వెనక్కి తగ్గి గులాబీ దళపతి కేసీఆర్‌తో రాజీకి కూడా యత్నించారంటూ కథనాలు వచ్చాయి. ఇందుకు టీఆర్ఎస్ పార్టీలో మొదట్నించి వున్న కొందరు నేతలు రాయభారం నెరపినా కేసీఆర్ ససేమిరా అన్నారని అప్పట్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ క్రమంలో ఇక టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం తన ఆత్మాభిమానానికి భంగమేనని భావించిన ఈటల రాజేందర్.. పార్టీకి, ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సుమారు నెలరోజులు ఏ పార్టీలో చేరాలి.. ? లేక సొంతంగా పార్టీ పెట్టాలా..? లేక ఇండిపెండెంట్‌గానే హుజురాబాద్‌లో తన సత్తా ఏంటో చాటాలా..? అనే అంశాలపై ఈటల మల్లగుల్లాలు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీలోకి రావాలంటూ ఈటలతో రాయభారాలు నడిపారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలు భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు వంటి వారు ఈటలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.
మరోవైపు ఈటలకు గాలమేసేందుకు తెలంగాణ బీజేపీ నేతలు తమ అధినాయకత్వాన్ని రంగంలోకి దింపారు. హుజురాబాద్ టిక్కెట్ ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో తగిన గౌరవాన్ని ఇస్తామంటూ బీజేపీ అధినాయకత్వం హామీ ఇవ్వడంతో ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటల బీజేపీలో చేరడంతో హుజురాబాద్ సీటును కోల్పోవద్దన్న కఠిన నిర్ణయానికి గులాబీ నేతలు వచ్చేశారు. కేసీఆర్ డైరెక్షన్‌లో హుజురాబాద్‌లో ప్రతి మండలానికిద్దరు మంత్రులను, గ్రామానికో ఎమ్మెల్యేను ఇంఛార్జీలుగా నియమించారు. ట్రబుల్ షూటర్ హరీశ్ రావు, మంత్రి గంగుల కమలాకర్‌లు 24 గంటలూ హుజురాబాద్ నియోజకవర్గంపైనే ఫోకస్ చేయడం ప్రారంభించారు. ఈటల వెంట వెళతారని భావించిన ప్రతీ ఒక్కరికి స్వయంగా హామీ ఇస్తూ వారిని గులాబీ పార్టీలోనే కొనసాగేలా చర్యలు తీసుకున్నారు హరీశ్, కమలాకర్. ఆల్ రెడీ ఈటల వెంట వెళ్ళిపోయిన వారిని కూడా నయానా, భయానా తిరిగి పార్టీలోకి రప్పించారు. ఇదేసమయంలో కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు మంత్రి హరీశ్ రావు. వారి వారి అవసరాలకు అనుగుణంగా హామీలనిస్తూ.. కుల సమీకరణల్లో హుజురాబాద్ సీటు చేజారకుండా చర్యలకుపక్రమించారు. ఇదేసమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. హుజురాబాద్‌లో పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. గెలుపు కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించారు. మంత్రులు హరీశ్, గంగులలకు కీలక ఆదేశాలిచ్చారు. అదేసమయంలో తాను ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలను సమీక్షించారు. దళిత బంధు పథక రచన చేశారు. ఎంపిక చేసిన దళిత కుటుంబాలలో ఒకరికి ఏకంగా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ.. వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా పథకరచన చేశారు. ఈపథకానికి సంబంధించిన విధివిధానాలను యుద్ధప్రాతిపదికన ఖరారు చేసి.. హుజురాబాద్ వేదికగానే బహిరంగ సభ నిర్వహించి.. ఎంపిక చేసిన కొందరికి చెక్కులను కూడా పంపిణీ చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు పథకం అంటూ విపక్షాలు ఆరోపణలు చేసినా.. అధికార పార్టీ వెనక్కి తగ్గలేదు.
దళిత బంధు ప్రకటన తర్వాత హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతారవరణం పెరిగిందన్న సంకేతాలొచ్చిన నేపథ్యంలో మరింత బలోపేతం అయ్యేందుకు గులాబీ దళం మరిన్ని సమ్మేళనాలను కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. మంత్రి హరీశ్ రోజుకో కులం నేతలు, వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గులాబీ దళం దూకుడుకు సమానంగా తామూ కొనసాగాలని భావిస్తున్న బీజేపీ నేతలు, అభ్యర్థి ఈటల రాజేందర్ కొన్ని రోజులు పాదయాత్రలు నిర్వహించారు. ఈటల రాజేందర్ కొన్ని రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి, అస్వస్థతకు గురికావడంతో నిలిపి వేశారు. ముందుగా కళ్ళు తిరిగిపడిపోయిన ఈటల రాజేందర్ కాలికి గాయం కావడంతో పరీక్షలు నిర్వహించారు. చివరికి పరిస్థితి ఆపరేషన్ దాకా వెళ్ళింది. దాంతో పాదయాత్ర ఆలోచనను పక్కన పెట్టేసిన ఈటల రాజేందర్.. కొన్ని రోజలు విశ్రాంతి తర్వాత గ్రామగ్రామాన తిరుగుతూ ఆత్మాభిమానం పేరిట ప్రచారం ప్రారంభించారు. హుజురాబాద్ ఆత్మాభిమానం ఏంటో గులాబీ పార్టీకి గుర్తు చేయాలంటూ ప్రకటనలు గుప్పించారు. మరోవైపు దుబ్బాకలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ.. హుజురాబాద్‌లోను అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసమే అన్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభించి.. అక్టోబర్ రెండు గాంధీజయంతి నాడు హుస్నాబాద్ సభతో ముగించారు. అధికారంలోకి వస్తే విద్య, వైద్యాలను ఉచితం చేస్తామంటూ బండి సంజయ్ ప్రజాకర్షక హామీని ప్రకటించారు. దీనిపై ఇపుడు తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది.
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు బీజేపీ తమ అధినాయకత్వాన్ని రంగంలోకి దింపుతోంది. బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జెపీ నడ్డా, స్మృతీ దేవేంద్ర ఫడ్నవీస్ వంటి జాతీయ నేతలతోపాటు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ సెల్ జాతీయ ఛైర్మెన్ డా. కే. లక్ష్మణ్, మురళీధర్ రావు, ఎంపీలు అరవింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ వంటి నేతలు హుజురాబాద్ ప్రచారంలో కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దానికితోడు గత 17 ఏళ్ళుగా ఈటల రాజేందర్ నిర్మించుకున్న క్యాడర్ కూడా బీజేపీకి దన్నుగా మారే పరిస్థితి వుంది. అయితే.. ఈటల క్యాడర్‌ని టీఆర్ఎస్ ఏమేరకు వెనక్కి లాగేసుకుంటుంది? ఎన్నికల వేళ ఎంతమందిని ఈటలకు దూరం చేయగలుగుతుంది అన్నది కూడా కీలకమే. తన క్యాడర్‌ని కాపాడుకోవడం, తాను లేవనెత్తిన ఆత్మాభిమాన నినాదానికి హుజురాబాద్ ఓటర్లు స్పందించేలా చేసుకోవడమే ఈటల గెలుపోటములను ప్రభావితం చేస్తుందనేది నిర్వివాదాంశం.
ఇక బరిలో వున్న మూడో పార్టీ కాంగ్రెస్. టీపీసీసీ అధ్యక్షునిగా ఎనుముల రేవంత్ రెడ్డి నియమితులు అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కలిగింది. దానికి తగినట్లుగానే రేవంత్ రెడ్డి.. తరచూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, బహిరంగ సభలతో పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసేలా వ్యవహరించారు. అయితే, తొలిరోజుల్లో రేవంత్‌కు లభించిన సహకారం ప్రస్తుతం పార్టీ సీనియర్ల నుంచి లభించడం లేదన్న కథనాలు వినిపిస్తున్నాయి. రేవంత్ ఏకపక్షంగా వ్యవహరించడం పార్టీ నేతలకు.. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదు. దాంతో వారు రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్న కార్యక్రమాలకు దూరంగానైనా వుంటున్నారు.. లేదా మొక్కుబడిగా అయినా హాజరవుతున్నారు. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పలు వాదోపవాదాలు జరిగాయి. మూడు, నాలుగు పేర్లతో పార్టీ ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ అధిష్టానానికి నివేదిక పంపారు. అందులో మాజీ మంత్రి కొండా సురేఖ పేరు కీలకంగా వుందన్న ప్రచారం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన సురేఖను తమ జిల్లాకు తరలించడంపై కరీంనగర్ జిల్లా కీలక నేతలు కొందరు అభ్యంతరం పెట్టారన్న ప్రచారం జరిగింది. కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపాదించడంతో కరీంనగర్ జిల్లాలో సీనియర్లకు భగ్గుమన్నారు. దాంతో హుజురాబాద్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గారన్న ప్రచారం జరిగింది. తాజాగా జిల్లా నేతల ప్రతిపాదనతో రాష్ట్ర ఎన్.ఎస్.యు.ఐ. అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగ్ రావు అలియాస్ బల్మూరి వెంకట్‌ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మరికొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా హుజురాబాద్ బరిలో నిలిచే అవకాశం వుంది. జూన్ 2021 కంటే ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు వేరు. ఆ తర్వాత పలువురు అటు, ఇటు పార్టీలు మారారు. జూన్ కంటే ముందు మంత్రిగా బలమైన నేతగా వున్న ఈటల రాజేందర్ అంతకు మందు ఏ మాత్రం బలం లేని బీజేపీ తరపున ఉప ఎన్నిక బరిలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నామమాత్రపు ఓట్లను మాత్రమే పొందింది. ప్రస్తుతం బీజేపీకి ఎంతో కొంత క్యాడర్ పెరిగినా.. ఆ పార్టీ అభ్యర్థి ఈటల గెలపునకు అది సరిపోదనే చెప్పాలి. ఈ క్రమంలో తనకు గత 17 సంవత్సరాలుగా అండగా వుంటూ వస్తున్న ఓటర్లను ఏ మేరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి తనవైపునకు ఈటల తిప్పుకుంటారనేది కీలకంగా మారింది. అదే ఆయన గెలుపోటములను ప్రభావం చేయనున్నది. 2018లో రెండో స్థానంలో వున్న కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి.. ఇపుడు గులాబీ పార్టీలో వున్నారు. ఆయన ఎమ్మెల్సీ నియామకం వివాదాస్పదంగా మారింది. ఇంకోవైపు హుజురాబాద్ బీజేపీలో గతంలో కీలకంగా వున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఈటల రాకతో కమలం గూటిని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరింత ఆసక్తి రేపుతున్న హుజురాబాద్ ఉప ఎన్నిక త్రిముఖపోరులో ఎలాంటి తీర్పు వెలువడుతుందో నవంబర్ రెండో తేదీన తేలనున్నది.