AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రోడ్డు పై గుంత..పోలీసులకు తెచ్చింది తంటా..మానవహక్కుల కమిషన్ నోటీసులతో పరేషాన్!

మన రోడ్లు కొన్ని ప్రాంతాల్లో నరకానికి రహదారుల్లా ఉంటాయి. ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదో గుంతలో పడకుండా మనం వాహనం నడపలేం అనేది పచ్చి నిజం.

Hyderabad: రోడ్డు పై గుంత..పోలీసులకు తెచ్చింది తంటా..మానవహక్కుల కమిషన్ నోటీసులతో పరేషాన్!
Pit On Road
KVD Varma
|

Updated on: Apr 11, 2021 | 6:39 PM

Share

Hyderabad: మన రోడ్లు కొన్ని ప్రాంతాల్లో నరకానికి రహదారుల్లా ఉంటాయి. ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఎదో గుంతలో పడకుండా మనం వాహనం నడపలేం అనేది పచ్చి నిజం. ఒక్కోసారి చీకట్లో రోడ్డు మధ్యలో ఉన్న గుంత కనబడక దానిలో పడి నడుములు విరిగినవారూ చాలామందే ఉంటారు. ఏదైనా గుంతలో మనం నడుపుతున్న బండి పడితే రోడ్లను.. ఆ రోడ్డేసిన వాళ్ళనూ.. గుంతలు పడ్డ రోడ్డు బాగుచేయించట్లేదని మనం ఓట్లేసిన వల్లనూ మనసులోనే బండబూతులు తిట్టుకుని సంబరపడిపోతాం. ఒక్కోసారి రోడ్డు పై ఉన్న గుంతతో దెబ్బలు తగిలితే దెబ్బ తగ్గేవరకూ అందరినీ ఆడిపోసుకుంటూ.. దెబ్బ తగ్గాకా ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ గుంత పక్క నుంచి చాలా జాగ్రత్తగా వెళ్లి హమ్మయ్య అనుకుంటాం. కానీ, హైదరాబాద్ లో ఓ యువకుడు అలా అనుకోలేదు. తనకు జరిగిన నష్టానికి కారణం ఎవరైతే వారు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ పోరాటం మొదలు పెట్టాడు.

హైదరాబాద్ మియాపూర్ కు చెందిన ఆ బాధితుడి పేరు వినయ్. అయన చెప్పిన వివరాల ప్రకారం.. గత ఏడాది డిసెంబర్‌ 3న జాతీయ రహదారిపై బైక్‌పై మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వైపు వినయ్ వెళుతున్నారు. ఆసమయంలో నేషనల్ హైవేపై గంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా తవ్వి వదిలేసిన గుంత లో బైక్‌ పడటంతో వినయ్‌ వెన్నెముకకు గాయమైంది. దీంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం.. వినయ్ న్యాయపోరాటానికి దిగారు. రోడ్ల నిర్వహణ సరిగ్గా లేదంటూ దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో డిసెంబర్‌ 6న ఫిర్యాదు చేశారు. సదరు కేసును పరిశీలించిన మియాపూర్ పోలీసులు సంఘ్తన జరిగిన ప్రాంతం తమ పరిధిలోనికి రాదనీ.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనీ ఆ ఫిర్యాదును చందానగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ విషయం తెలిసిన వినయ్ మళ్ళీ చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఇంకో ఫిర్యాదు చేశారు. అయితే, 15 రోజులైనా ఆ ఫిర్యాదుపై చందానగర్ పోలీసులు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన వినయ్ జనవరి 2వ తేదీన ఆయన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించారు. దీంతో కేసును పరిశీలించిన హెచ్‌ఆర్‌సీ తాజాగా శనివారం చందానగర్ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 21న సదరు ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఆర్‌సీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.