హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో పొద్దున 7 గంటల నుంచే సూర్యుని సెగలతోపాటు వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు వర్షాలు కురిసే అవకాశముంది.
అకాల వర్షాలు రైతన్నకు శాపంగా మారాయి. సిద్దిపేట జిల్లా మండలంలో నంగునూరు మండలంలో కురిసిన గాలివానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కవర్లు కప్పి రక్షించే ప్రయత్నం చేసినా వేగంగా వీచిన గాలులకు కవర్లు కొట్టుకుపోయాయి. ధాన్యం రాశులు, బస్తాలు వరద నీటికి తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. భారీ వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యం నీటిపాలై అపార నష్టం వాటిల్లింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంపై బలంగా ద్రోణి ప్రభావం ఉండనుంది. రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్లవాన పడే అవకాశం ఉందని సూచించింది ఐఎండీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..