AP&TS Rains: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం.. నీటమునిగిన పంట.. రైతుల కన్నీళ్లు..
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానకు పంట తడిసి ముద్దవుతోంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు ఆగమవుతుండడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు రైతులు.

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానకు పంట తడిసి ముద్దవుతోంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు ఆగమవుతుండడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు రైతులు.
కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతింటున్నాయి. కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. చొప్పదండి, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్, బీబీపేట, దోమకొండ, రాజంపేట, మాచారెడ్డి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోనూ అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం అకాల వర్షంతో పూర్తిగా తడిసిపోయింది. యార్డులో ఆరబోసిన వరి ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. వరి ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతన్నలు.




మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులు ధాన్యం ఆరబోసుకోగా.. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో తడిసి ముద్దయింది. వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. దాంతో.. మార్కెట్ యార్డులోని వడ్లు, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంట నీళ్ల పాలైంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అకాల వర్షాలు బీభత్సం చేశాయి. యాదగిరిగుట్ట పరిధిలోని రాజాపేట మండలం కుర్రారంలో ఈదురు గాలులకు మామిడి నేలరాలింది. సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి, తిరుమలగిరి, ఎస్.ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల మండలాల్లో వడగళ్ళ వాన పడింది.
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను ఆగమాగం చేసేసింది. జనగామలో రాళ్ల వానతోపాటు ఈదురుగాలుల దెబ్బకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఇక.. అకాల వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి.
మరోవైపు.. ఏపీలోని పలు జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వాణిజ్య పంటలు నేలకొరిగాయి. అలాగే.. ఈదురుగాలకు చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా వి.మాడగులలో పిడుగుపాటుతో గేదె మృతి చెందగా ఓ మహిళ కన్నీరుమున్నీరైంది.
జీవనాధారమైన గేదే పిడుగుపాటుకు మృతి చెందండంతో యాల్ల కొండమ్మ అనే మహిళ ఆవేదన చెందింది. విశాఖ జిల్లాలోని అరకులో భారీ వడగళ్ల వర్షం పడింది. సుమారు గంటపాటుగా అరకులోయను వాన ముంచెత్తింది. అటు ప్రకాశం జిల్లాలోనూ అకాలం వర్షం బీభత్సం సృష్టించింది. గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం బెస్తవారిపేట పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలతో వందల ఎకరాల్లో అరటి చెట్లు ఈదురు గాలులకు నేలకొరిగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..