TSRTC : తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్రజలకు గుడ్ న్యూస్..! రేపట్నుంచి రెండు రాష్ట్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీసులు
తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్రజలకు గుడ్ న్యూస్. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపుల బాట పట్టాయి. అయితే,..
TSRTC Bus Services resume : తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్రజలకు గుడ్ న్యూస్. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపుల బాట పట్టాయి. అయితే, తెలంగాణలో మాత్రం నేటి నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఫలితంగా తెలంగాణ నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది.
ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. అటు, ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ సడలించిన నేపధ్యంలో ఈ టైమింగ్స్ కు అనుగుణంగా బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. కర్ఫ్యూ సడలించిన వేళల్లో ప్రయాణికులు గమ్య స్థానం చేరుకునేలా బస్సులు నడపనుంది టీఎస్ఆర్టీసీ. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఏపీ కర్ఫ్యూ వేళలకు అనుగుణంగా బస్సులు నడుస్తాయి. ప్రయాణీకులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే బస్సుల్లో ప్రయాణం సులువు అవుతుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.
అటు, తెలంగాణ నుంచి కర్నాటకకు కూడా బస్సులు తిప్పాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. కర్నాటకలో కూడా వారాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తూ కర్ఫ్యూ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో కర్ఫ్యూ సడలింపులకు అనుగుణంగా తెలంగాణ నుంచి కర్నాటకకు.. కర్నాటక నుంచి తెలంగాణకు టీఎస్ ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఇలా ఉండగా, కర్నాటకలో ఉదయం 5 నుంచి సాయంత్రం 7 వరకు బెంగళూరు మినహా మిగిలిన ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. వీకెండ్స్ లో మాత్రం లాక్ డౌన్ నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణ నుంచి కర్నాటకకు.. కర్నాటక నుంచి తెలంగాణకు ఎలాంటి బస్సులు తిరగవు అని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Read also : IRCTC : టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది.. అయితే, కండిషన్స్ అప్లై.!