Telangana: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆ పంటలు వేస్తే.. ఎకరానికి రూ.5వేల ప్రోత్సాహకం!
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకం అందించాలని ప్లాన్ చేస్తుంది. వరికి బదులుగా పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్న, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 నుంచి 5వేల వరకు ప్రత్సాహకం ఇవ్వాలని ఆలోచిస్తోంది.

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోచే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండగా, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగు తగ్గుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంపై దృష్టి సారించింది. ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వరికి బదులుగా పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్న, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలు సాగు చేసే రైతులకు ఈ ప్రోత్సాహకం అందించాలని సూచనలు వచ్చాయి.
రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరగడం, ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధరతో పాటు సన్న రకాల వరికి బోనస్ ఇవ్వడం వల్ల రైతులు అధికంగా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇతర ఆహార పంటల ఉత్పత్తి తగ్గిపోవడంతో వాటి కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రత్యామ్నాయ పంటల సాగు పెరగడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో పాటు, పప్పుధాన్యాలు, వంటనూనెల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనెగింజల సాగును కూడా ప్రోత్సహించాలని భావిస్తోంది.
రైతు భరోసా పథకంలోనూ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నిజంగా సాగు చేసిన భూములను గుర్తించి, పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా అందించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాగు చేయని భూములు, వెంచర్లు, రాళ్లు, గుట్టలు ఉన్న ప్రాంతాలకు రైతు భరోసా ఇవ్వకుండా నిబంధనలు తీసుకురావాలనే యోచనలో ఉంది.
ఈ విధానంతో ప్రభుత్వానికి ఆదా అయ్యే నిధులను పంటల బోనస్, పంటల బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరే విధంగా నిధులను మళ్లించాలనే ఆలోచన జరుగుతోంది.
ఇవే కాకుండా వీబీజీరామ్‌జీ అమలు, మెట్రో రైలుకు అవసరమైన రుణాలపై ఎస్‌బీఐ క్యాప్స్ రూపొందిస్తున్న నివేదిక వంటి కీలక అంశాలపై కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు సంక్షేమం, వ్యవసాయ విధానంలో మార్పులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
