Ghanpur Station Election Result 2023: స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్‌ఎస్‌నే ఆదరించిన ఓటర్లు
Ghanpur Station Assembly Election Result 2023 Live Counting Updates: ఈ సారి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే టీ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి కేటాయించారు. మొత్తానికి బీఆర్‌ఎస్ ఇక్కడ విజయం సాధించింది.
తెలంగాణలో విలక్షణ తీర్పుతో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో స్టేషన్ ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం (Ghanpur Station Assembly Election) ఒకటి. ఈ నియోజకవర్గంలోని ప్రాంతాలు జనగాం, హన్మకొండ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. జనగాం జిల్లాలోని ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, రఘునాథపల్లె, జాఫర్‌గఢ్, లింగాలఘనపూర్ మండలాలు, హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్, వెలైర్ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 2,49,155 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 30న పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 86.40 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం 1978 నుంచి ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.మొదట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు మళ్లింది. ఇప్పుడు గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ జయకేతనం ఎగరవేసింది. ఆ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి 7779 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కడియం శ్రీహరికి 101696 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థిని సింగాపురం ఇందిరకు 93917 ఓట్లు.. పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి విజయరామారావుకి.. 4984 ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009 నుంచి ఈ నియోజకవర్గానికి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంవహిస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి డిప్యూటీ సీఎంగా టి రాజయ్య పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి టీ రాజయ్య 35,790 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా సింగపురంపై విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో టీ రాజయ్యకు 98,612 ఓట్లు పోల్ కాగా.. ఇందిరా సింగపురంకు 62,822 ఓట్లు దక్కాయి. గతంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు.
ఈ సారి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే టీ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి కేటాయించారు. టికెట్‌ను తనకు కేటాయింకపోవడం పట్ల టీ రాజయ్య వెక్కివెక్కి ఏడ్చారు. టికెట్ దక్కక గుర్రుగా ఉన్న రాజయ్యను శాంతింపజేసేందుకు ఆయనకు రైతు బంధు సమితి ఛైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ సారి ఎన్నిక్లలో కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిర, బీజేపీ నుంచి గుండె విజయరామారావు బరిలో నిలిచారు. విజయరామారావు గతంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా ఒకసారి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్