Gazette Notification: గెజిట్ అమలుపై సందిగ్ధత.. ఏపీ అంగీకారం.. ఇచ్చేందుకు తెలంగాణ ససేమిరా.. మళ్లీ కేంద్రం కోర్టులోకి బంతి
తెలంగాణ, ఆంధ్రా జల వివాదాలకు తెరపడుతుందా? కృష్ణా, గోదావరి బోర్డులు ఏం చేయబోతున్నాయ్? అసలు, గెజిట్ అమలవుతుందా? లేదా? సమస్య మళ్లీ మొదటికొచ్చిందా? అలాగే కనిపిస్తోంది పరిస్థితి.
కృష్ణా,గోదావరి బోర్డుల గెజిట్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాలి. కానీ గెజిట్ అమలుపై డైలమా నెలకొంది. బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై సందిగ్థత కొనసాగుతోంది. ఇవాల్టి నుంచి గెజిట్ అమలుకావాల్సి ఉన్నా..రెండు తెలుగు రాష్ట్రాల భిన్నాభిప్రాయాలతో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి అంగీకరించేది లేదంటోంది తెలంగాణ. అయితే బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాతే జీవో ఇవ్వాలని నిర్ణయించింది. బోర్డుల పరిధిలోకి జూరాల ప్రాజెక్టును కూడా చేర్చాలంటున్నారు ఏపీ జనవనరుల నిపుణులు. జూరాలను చేర్చకపోతే ఏపీ తీవ్రంగా నష్టపోతుందంటున్నారు. రెండు రాష్ట్రాలు జీవోలు విడుదల చేస్తేనే..గెజిట్ నోటిఫికేషన్‌కు మార్గం సుగమమవుతుంది.
తెలంగాణ, ఆంధ్రా జల వివాదాలకు తెరపడుతుందా? కృష్ణా, గోదావరి బోర్డులు ఏం చేయబోతున్నాయ్? అసలు, గెజిట్ అమలవుతుందా? లేదా? సమస్య మళ్లీ మొదటికొచ్చిందా? అలాగే కనిపిస్తోంది పరిస్థితి. మీటింగ్స్ మీద మీటింగ్స్. మూడు నెలలుగా చర్చోపచర్చలు. కానీ, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలు ఇప్పట్లో తేలేటట్టు కనిపించడం లేదు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ముందుకు రాకపోవడంతో గెజిట్ అమలుపై గందరగోళం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు జులై 15న కేంద్ర జలశక్తిశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ గెజిట్ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. గెజిట్ ప్రకారం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీలకు అప్పగించాల్సి ఉంది. అయితే, ఏపీ ఓకే చెప్పినప్పటికీ, తెలంగాణ మాత్రం నో అంటోంది.
ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేవరకు గెజిట్‌ను అమలు చేయొద్దని తెలంగాణ వాదిస్తోంది. అలాగే, శ్రీశైలం, సాగర్ జల విద్యుత్ కేంద్రాలను అప్పగించేందుకు కూడా తెలంగాణ ససేమిరా అంటోంది. తెలంగాణకు విద్యుత్ అవసరాలు ఉన్నందున అప్పగించేది లేదంటోంది. అయితే, పవర్ ప్లాంట్స్‌ను అప్పగించకపోతే గెజిట్‌కు అర్ధమే ఉండదంటోంది ఏపీ. విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ అధిక నీటిని వినియోగిస్తోందని, దీన్ని నియంత్రించినప్పుడే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని ఏపీ వాదిస్తోంది.
పెద్దవాగు ప్రాజెక్టుపైనా తెలంగాణ వెనకడుగు వేస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించినా… ఉత్తర్వులిచ్చేందుకు మాత్రం తెలంగాణ వెనకడుగు వేస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగిస్తే… శ్రీశైలం, సాగర్‌లో 10 ఔట్‌లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులివ్వాల్సి వస్తుందని తెలంగాణ భావిస్తోంది.
ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తే ఏర్పడే పరిణామాలు, పరిస్థితులపై తెలంగాణ అధ్యయనం చేస్తోంది. బోర్డులకుండే అధికారాలేమిటి? రాష్ట్రాలకుండే పవర్స్ ఏమిటన్న అంశాలపై చర్చిస్తోంది. పరిస్థితి అనుకూలంగా ఉంటేనే అప్పగించాలని, లేదంటే నో చెప్పాలని తెలంగాణ భావిస్తోంది.
గెజిట్ అమల్లోకి రావాలంటే బోర్డులు ప్రతిపాదించిన ఔట్ లెట్స్‌ను అప్పగిస్తూ ఇరు రాష్ట్రాలు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఔట్ లెట్స్‌ను అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల నీటి వాటాల అమలు బాధ్యతను కృష్ణా, గోదావరి బోర్డులు తీసుకుంటాయ్. గెజిట్ అమలైతే ప్రాజెక్టులు, సిబ్బంది, నిధులు, ఆస్తులు బోర్డుల ఆధీనంలోకి వెళ్లిపోతాయ్.
శ్రీశైలం, సాగర్ జల విద్యుత్ కేంద్రాలను అప్పగించేందుకు తెలంగాణ ససేమిరా అంటోంది. దాంతో, గెజిట్ అమలు సందిగ్ధంలో పడింది. తెలంగాణ అభ్యంతరాలతో బంతి మళ్లీ కేంద్రం కోర్డులోకి వెళ్తోంది. మరి, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో? బోర్డులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..