LPG: బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ వారమైనా ఇంకా రాలేదా.? అయితే ఇలా చేయండి..
సాధారణ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ నడుం బిగించింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత డెలివరీలో జాప్యం జరిగినా, లేదా ఏజెంట్లు అదనపు వసూళ్లకు పాల్పడినా వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖాధికారుల దృష్టికి వచ్చింది. బుక్ చేసిన సకాలంలో సిలిండర్ అందకపోవడం, గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి చర్యలపై శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత నిర్ణీత సమయంలోగా డెలివరీ ఇవ్వడం ఏజెన్సీల బాధ్యత. ఒకవేళ డెలివరీలో జాప్యం జరిగితే వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కేటాయించిన 1967 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ నంబర్ ద్వారా పౌరసరఫరాల శాఖకు నేరుగా సమాచారం అందుతుంది. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారు.
డెలివరీ జాప్యంతో పాటు, గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కట్ విక్రయాలపై కూడా అధికారులు నిఘా పెంచారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అక్రమంగా విక్రయించడం చట్టరీత్యా నేరం. డెలివరీ బాయ్స్ నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చినా పౌరసరఫరాల శాఖకు సమాచారం అందించాలి. ప్రతి గ్యాస్ ఏజెన్సీ పారదర్శకంగా పనిచేసేలా జిల్లా యంత్రాంగం నిరంతర తనిఖీలు చేపడుతోంది. గ్యాస్ ఏజెన్సీలు తమ వద్ద ఉన్న నిల్వలు, బుకింగ్ వివరాలను పారదర్శకంగా ఉంచాలని అధికారులు ఆదేశించారు. వినియోగదారులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సామాన్య ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ కోరుతోంది. ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇది చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..
