IPL 2026 : కేకేఆర్ పతనంపై రహానే ఆవేదన.. చెపాక్‌లో మళ్ళీ అదే కథ.. రవిశాస్త్రి ఇచ్చిన సలహా ఏంటి?
IPL 2026 : 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభం నుంచే తడబడింది. సునీల్ నరైన్ (24), ఫిన్ అలెన్ (1)లను ఓపెనర్లుగా పంపి కొత్త ప్రయోగం చేసినా ఫలితం దక్కలేదు. పవర్‌ప్లేలో కేవలం 36 పరుగులే చేసి కీలక వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఆడినా, ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా నమోదు చేయలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిపోవడం కేకేఆర్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ అజింక్య రహానే తన బాధను వ్యక్తం చేయగా, మాజీ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించారు.
ఏమైంది ఆ ఛేజింగ్‌లో?
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభం నుంచే తడబడింది. సునీల్ నరైన్ (24), ఫిన్ అలెన్ (1)లను ఓపెనర్లుగా పంపి కొత్త ప్రయోగం చేసినా ఫలితం దక్కలేదు. పవర్‌ప్లేలో కేవలం 36 పరుగులే చేసి కీలక వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కెప్టెన్ రహానే 28 పరుగులు చేసినా, 22 బంతులు తీసుకోవడం వల్ల రన్ రేట్ ఒత్తిడి పెరిగింది. మిడిల్ ఓవర్లలో నూర్ అహ్మద్ స్పిన్ ధాటికి కేకేఆర్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. చివరకు 160 పరుగులకే పరిమితమై, వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.
రహానే ఏమన్నాడంటే?
మ్యాచ్ అనంతరం రవిశాస్త్రితో మాట్లాడిన రహానే.. తమ బ్యాటింగ్‌లో లయ లోపించిందని అంగీకరించాడు. “పవర్‌ప్లేలో కేవలం 36 పరుగులే రావడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. స్పిన్నర్లను ఎదుర్కోవడం సవాలుగా మారింది. జట్టులో ఒకరు చివరి వరకు ఉండి మ్యాచ్‌ను గెలిపించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చాలా కష్టంగా ఉంది. గెలుపు దక్కకపోవడం బాధిస్తోంది. అయితే జట్టుగా మేమంతా సానుకూల దృక్పథంతో ఉండి, తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి” అని రహానే పేర్కొన్నాడు. జట్టు కూర్పులో మార్పులు చేసే అవకాశం ఉందని కూడా హింట్ ఇచ్చాడు.
రవిశాస్త్రి లాస్ట్ వర్డ్
రహానే తన గోడును వెళ్లబోసుకున్న తర్వాత, ఇంటర్వ్యూను ముగిస్తూ రవిశాస్త్రి ఒక ముఖ్యమైన మాట అన్నాడు. “కాస్త ఓపిక పట్టండి, త్వరలోనే మీకు సరైన జట్టు కూర్పు దొరుకుతుందని ఆశిస్తున్నాను” అని రహానేకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్‌కు ఇది చావో రేవో లాంటి పరిస్థితి. టీమ్ మేనేజ్‌మెంట్ ఇకనైనా ప్రయోగాలు మాని, నిలకడైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను ఎంచుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాచ్ హైలైట్స్
టాస్ గెలిచిన రహానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సంజూ శాంసన్ (48), డేవాల్డ్ బ్రెవిస్ (41) మెరుపులతో సీఎస్‌కే ఒక దశలో 220 పరుగులు చేస్తుందనిపించింది. కానీ సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్‌కేను 192 పరుగుల వద్ద కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం కేకేఆర్ ఆ సత్తాను చాటలేకపోయింది. రింకూ సింగ్ (6) వైఫల్యం కూడా జట్టుపై ప్రభావం చూపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
