Telangana: చోరీకి విఫలయత్నం.. తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

|

Jul 10, 2024 | 9:44 AM

ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు.. లాకర్‌ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎమ్‌ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ విచిత్ర ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం (జులై 9) చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్‌కుంద మండల కేంద్రంలోని బిచ్కుందలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌లోకి మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్‌ వాహనంలో వచ్చారు..

Telangana: చోరీకి విఫలయత్నం.. తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
SBI ATM machine Stolen in Telangana
Follow us on

బిచ్కుంద, జులై 10: ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు.. లాకర్‌ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎమ్‌ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ విచిత్ర ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం (జులై 9) చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్‌కుంద మండల కేంద్రంలోని బిచ్కుందలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌లోకి మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్‌ వాహనంలో వచ్చారు. ఈ ఏటీఎం ఎస్బీఐ బ్యాంకు పక్కనే ఉంది. వేకువ జాము కావడంతో జనసంచారం లేదు. ఇదే అదనుగా దుండగులు ఏటీఎంలోని లాకర్‌ను తెరిచేందుకు యత్నించారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోకపోవడంతో దాన్ని తాళ్లతో కట్టి.. ఆ తాళ్లు తమ వాహనానికి జత చేసి లాగారు. దీంతో ఏటీఎమ్‌ గది అద్దాల తలుపులు ధ్వంసం చేసుకుంటూ బయటకు వచ్చింది. అనంతరం చోరీ చేసిన ఏటీఎంను తమ వాహనం వెనుకభాగంలో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డైంది.

అయితే దుండగులు ఏటీఎంను దొంగిలిస్తున్న సమయంలో సైరన్‌ మోగడంతో బ్యాంకు అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. కానీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనేలోగా దొంగలు పరారయారు. ఏటీఎంలో రూ.3.97 లక్షల మేర నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన ఈ ఏటీఎం సెంటర్‌ కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ఈ ఘటన వెనుక మహారాష్ట్రకు చెందిన ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మహారాష్ట్ర సరిహద్దులో గుల్ల వద్ద దొంగలు వినియోగించిన క్వాలిస్‌ వ్యాన్‌ కనిపించింది. అయితే వారు అక్కడ వాహనాన్ని వదిలేసి.. మరో వాహనంలో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్‌ చేరుకొని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దుండగులు పారిపోతూ మార్గం మధ్యలో జుక్కల్‌ మండలం పెద్దఏడ్గి గ్రామంలో మరో బైకులు కూడా చోరీ చేసిటన్లు జుక్కల్‌ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా 3 నెలల క్రితం నిజామాబాద్‌ జిల్లా రుద్రూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇక 2021 ఫిబ్రవరిలో ఆదిలాబాద్ పట్టణంలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. తర్వాత దుండగులు మెషిన్‌ ఊడదీసి నగదు హోల్డర్‌ను తీసుకొని మిగతా యంత్రాన్ని నగర శివార్లలో పడేశారు. నిజామాబాద్‌లోనూ గత అక్టోబర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి యత్నించగా.. అప్రమత్తమైన స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.