పిడుగుల బీభత్సం.. గంటల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో నలుగురు బలి..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. భీకరమైన గాలివానకు తోడు పిడుగులు భీభత్సం సృష్టించాయి. గంటల వ్యవధిలోనే నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అకాల వర్షాలు నాలుగు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చాయి. వీరంతా వ్యవసాయ, అనుబంధ పనుల్లో ఉండగానే అకాల వర్షానికి వచ్చిన పిడుగులకు బలయ్యారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. భీకరమైన గాలివానకు తోడు పిడుగులు భీభత్సం సృష్టించాయి. గంటల వ్యవధిలోనే నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. అకాల వర్షాలు నాలుగు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చాయి. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో ఇద్దరు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో మరో ఇద్దరు పిడుగుల పాటుకు మృత్యువాత పడ్డారు. వీరంతా వ్యవసాయ, అనుబంధ పనుల్లో ఉండగానే అకాల వర్షానికి వచ్చిన పిడుగులకు బలయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన గాజుల వీరమ్మ(55), సుంకరి సైదమ్మ(40), సుంకరి లక్ష్మమ్మ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వేరుశెనగ పొలంలో పనులు చేస్తుండగా సాయంత్రం అకాల వర్షం కురిసింది. వర్షానికి తోడు బలమైన గాలులు వీచాయి. జడివానతో పాటు పిడుగులు పడడంతో సుంకరి సైదమ్మ, గాజుల వీరమ్మ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిల సుంకరి లక్ష్మమ్మకు తీవ్ర గాయలు కావడంతో స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందడంతో కోడోనిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో పలు చోట్ల పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) మధ్యాహ్నం తర్వాత తన వ్యవసాయ బావి వద్ద పనుల కోసం వెళ్లాడు. పొలం వద్ద గేదెలను మేపుతుండగా అకాల వర్షానికి పిడుగుపడి అక్కడిక్కడే మృతి చెందాడు. వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామంలో మరో యువ రైతు పిడుగుపాటుకు మృత్యువాత చెందాడు. సాయంత్రం గేదెలను మేపడానికి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పిడుగుపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇదే జిల్లాలో గట్టు మండలంలో ఓ రైతుకు చెందిన పశువుల పాకపై పిడుగు పడడంతో రెండు ఎద్దులు మరణించాయి.
పిడుగులతో ప్రాణనష్టమే కాకుండా అకాల వర్షాలకు చేతికి వచ్చిన మామిడి, సపోటా తోటలు దెబ్బతిన్నాయి. బలమైన గాలులకు గద్వాల్, ఇటిక్యాల, మానవపాడు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అకాల కష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..