RRR: హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు.. కడుపు కొట్టదంటున్న రైతన్న
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. RRR ఉత్తర భాగం నిర్మాణానికి అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి.
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. RRR ఉత్తర భాగం నిర్మాణానికి అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. రాష్ట్రానికి RRR లైఫ్ లైన్ కానుందని ప్రభుత్వం అంటుండగా, అక్కడి వారు మాత్రం తమ డెత్ లైన్ గా మారుతుందని భావిస్తున్నారు. త్రిబుల్ ఆర్ రగడపై అక్కడి రైతులు న్యాయ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ న్యాయ పోరాటంతో రీజినల్ రింగ్ రోడ్ కు బ్రేక్ పడుతుందా..?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డుకు రూ. 26 వేల కోట్ల అవసరమని అంచనా వేశారు. ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లా నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వరకు విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ 158 కి.మీ.ల మేర ఉంటుంది. సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్, తూప్రాన్, హత్నూర, శివ్వంపేట, చౌటకూర్, తుర్కపల్లి, యాదాద్రి, వలిగొండ, చౌటుప్పల్, భువనగిరి మండలాల మీదుగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం జరిగేలా అలైన్‌మెంట్ రూపొందించారు. ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరి డివిజన్ లో 199 హెక్టార్ల భూమి సేకరించనున్నారు. డివిజన్ లోని రాయగిరి, బాలెంపల్లి, గౌస్ నగర్, కేసారం, పెంచికల్ పహాడ్, తుక్కాపూర్, ఎర్రంపల్లి, యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి, మల్లాపూర్ గ్రామాల భూమిల్లోంచి రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తోంది. దీంతో ఇక్కడ రైతుల గుండెల్లో రీజినల్ రింగ్ రోడ్డు గుబులు పుట్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని నమ్ముకున్న రైతులకు ఆ భూమి దక్కకుండా పోతోంది.
రాయగిరి మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు..
తాజాగా రాయగిరి గ్రామం మీదుగానే ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తో ఉన్న కాస్తా భూమి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇందు కోసం 250 ఎకరాల వరకు అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రజా అవసరాల కోసం ఇప్పటికే రాయగిరి వాసులు ఎన్నో ఎకరాలు త్యాగం చేశారు.. ఇలా ఒక్క రాయగిరి గ్రామంలోనే 750 ఎకరాల భూమిని రైతులు కోల్పోయారు. వరుస అభివృద్ధి పనులు ఇప్పుడు ఆ గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. కాళేశ్వరం కాల్వలకు ఓసారి.. హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికిమరోసారి.. హై టెన్షన్ విద్యుత్ లైన్లకు ఇంకోసారి అక్కడి రైతులు భూములు కోల్పోయారు. అభివృద్ధి కోసమే కదా అనుకున్నారు. అటు దేవుడు, ఇటు కరెంటు కోసం కోట్ల రూపాయల విలువైన భూములు ఇవ్వలేక ఇచ్చారు. ప్రజా అవసరాల కోసం ఇప్పటికే మూడు సార్లు భూములు ఇచ్చామని.. గత అభివృద్ధి పనులతో రాయగిరి మూడు ముక్కలైందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుత అలైన్మెంట్ తో ఊరు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని రాయగిరి వాసులు వాపోతున్నారు. ఇప్పుడూ ఉన్న కొద్ది భూములు కూడా కోల్పోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం ఉన్న భూమిని అమ్ముకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎలాగైనా రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని వేడుకుంటున్నారు.
రైతుల వ్యధ వర్ణనాతీతం..
రాయగిరి రైతుల వ్యధ వర్ణనాతీతం. పచ్చటి పొలాల మధ్య ఇన్నాళ్లు బతుకు వెల్లదీసిన తమకు ఈ పంట పొలాలన్నీ చేజారి పోతాయేమోనని మానసికంగా కృంగిపోతున్నారు. రాయగిరి రెవెన్యూ పరిధిలోని బాలెంపల్లికి చెందిన రాములుకు ఆరు ఎకరాల భూమి ఉంది. గతంలోనే హైటెన్షన్ లైన్ కోసం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా రెండు ఎకరాల భూమిని తీసుకున్నారు. కాళేశ్వరం కాల్వ కోసం 15 గుంటల భూమి తీసుకున్నారు. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు కోసం మూడు 3 ఎకరాలు తీసుకుంటున్నారు. గ్రామంలో చాల మంది రైతులది ఇదే పరిస్థితి. పంటలు పండే భూములు ఇలా తీసుకుంటే తాము ఎలా బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక సర్వే నంబర్ 690లో తెల్జూరి ఐలయ్య అన్నదమ్ములిద్దరి పేరున మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటులో గుంట భూమి లేకుండా పోతోంది. దీంతో మాకు బతుకు దెరువు కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులు మొత్తం భూమిని కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఆధారపడి బతుకుతు న్నామని, భూమి లేకపోతే రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు కోల్పోతే తమ భవిష్యత్తు ఏంటని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇటీవల త్రిబుల్‌ఆర్ నిర్మాణంలో ఆరెకరాల వరి పొలం పోతోందన్న మనోవేదనతో ఓ రైతు ప్రాణాలు విడిచాడు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి చెందిన మామిడి నర్సిరెడ్డి(70)కి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఏడాది క్రితం రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. ఆర్ఆర్ఆర్ హద్దులు వేశారు. ఆరెకరాల పంట భూమిని రోడ్డు నిర్మాణానికి తీసుకోంటున్నట్లు రెవిన్యూ అధికారులు చెప్పారు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన నర్సిరెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. గత ప్రభుత్వ హయాంలో ఆర్‌ఆర్‌ఆర్ భూబాధితులు చేపట్టిన ఆందోళనలో నర్సిరెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలైన్‌మెంట్‌ను మార్చాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను కలిసి వేడుకున్నారు. ఆ గ్రామంలో ఎకరా పొలం బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.కోటి పలుకుతుండగా.. ప్రభుత్వం ఇచ్చే పరిహారం లక్షల వరకే వస్తుందండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
త్రిబుల్ ఆర్‌పై న్యాయ పోరాటం..
ఉత్తర భాగం నిర్మాణానికి ఇప్పటికే అలైన్‌మెంట్ ఖరారై భూసేకరణ కూడా చాలావరకు పూర్తైంది. రాయిగిరి వద్ద అలైన్‌మెంట్‌ను మార్చాలని గ్రామస్థులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు భూసేకరణ నిలిపివేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు విధించిన స్టే ఎత్తివేత కోసం ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ కొన్నాళ్లుగా రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. గత ఏడాది యాదాద్రి కలెక్టరేట్ ముందు రాయగిరి రైతులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆరుగురు రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టీ సంకెళ్లతో తీసుకువెళ్లారు. రైతులకు బేడీలు వేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వచ్చాయి. పోలీసులు తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తమను తీవ్రవాదుల మాదిరిగా సంకెళ్లు వేసి జైలుకు తీసుకువెళ్లారని, ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు చెబుతున్నారు.
అలైన్మెంట్ మార్పు పై రాజకీయ కుట్ర…
రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ముందుగా రాయగిరి ప్రాంతానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన ప్రతిపాదనను తర్వాత మార్చడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారులకు అనుగుణంగా రాజకీయ కోణంలోనే అలైన్‌మెంట్ మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత నిర్ణయిచినట్లుగా కాకుండా రాజకీయ వత్తిళ్లతో అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆశలు…
రాయగిరి వద్ద రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారుస్తామని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ రాయగిరి రైతులకు న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హామీ ఇచ్చారు. అలైన్మెంట్ మార్పుపై గతంలో చేసిన ఆందోళనలకు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. కానీ అధికారంలోకి వచ్చాక అలైన్మెంట్ మార్పుపై నోరెత్తడం లేదు. రీజనల్ రింగ్ రోడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 1525 కోట్ల రూపాయలు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకముందని స్థానిక నేతలు చెబుతున్నారు. బాధితులతో సీఎం రేవంత్ సమావేశాన్ని నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
అభివృద్ధిని స్వాగతించాల్సినప్పటికీ ఉన్న భూమి కోల్పోయి రోడ్డున పడడం ఆ రైతులను మనోవేదనకు గురి చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా అలైన్మెంట్ ను మార్చాలి… లేకపోతే బాధ్యత రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..