Nalgonda: నేను US, ఆస్ట్రేలియా రిటన్.. మీకు జాబ్ కన్ఫామ్ అంటాడు.. డబ్బు తీసుకున్నాక
నేటి యువతలో చాలా మంది జల్సాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం ప్లాన్ వేస్తుంటారు. ఇందుకోసం కొందరు కేటుగాళ్లు తమ పరిచయాలు, తేలివితేటలనే పెట్టుబడి పెడుతున్నారు. అమాయక నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకొని మోసం చేస్తుంటారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ కేటుగాడు ఎలా బురిడి కొట్టించాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

విదేశాల్లో ఎంఎస్ వంటి ఉన్నత విద్యను అభ్యసించి.. అక్కడే ఉద్యోగం చేయాలని నిరుద్యోగులు ఆశపడుతున్నారు. అవకాశముంటే విదేశాల్లోనే స్థిరపడాలని కూడా భావిస్తుంటారు. ఇలాంటి ఆశలను కొందరు కంత్రిగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాటికొండ మండలం బండారుపల్లికి చెందిన ముప్పాళ్ల లీలా కృష్ణ కొన్నాళ్లు అమెరికా, ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేశాడు. ఇండియాకు తిరిగి వచ్చి చెడు వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడ్డాడు. ఈజీ మనీ కోసం పథకం వేశాడు. ఇందు కోసం తన తెలివితేటలు, విదేశాల్లోనీ పరిచయాలను ఉపయోగించుకొని, మోసాలకు పాల్పడుతున్నాడు. విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను టార్గెట్ గా చేసుకున్నాడు. విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇలా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు కొట్టేశాడు. నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగర్‌కు చెందిన కోయల కార్ కరుణభాయ్.. కొడుకుకు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని లీలా కృష్ణ మోసం చేశాడు.
దీంతో కరుణభాయ్.. ముప్పాళ్ల లీలా కృష్ణపై చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మాల్ గ్రామం – మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని చింతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిరుద్యోగ యువతను టార్గెట్ గా చేసుకొని భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడినట్లు తేలింది. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎనిమిది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి రూ.85 లక్షల వరకు తీసుకొని మోసం చేసినట్లు గుర్తించారు. ఈ విధంగా సంపాదించిన డబ్బును నిందితుడు కృష్ణ విలాసాలకు, జల్సాలకు ఖర్చు పెట్టాడని నల్గొండ ఎస్ పి రమేష్ తెలిపారు. నిందితుని నుంచి ల్యాప్‌టాప్, మూడు సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు కేటుగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు వసూలు చేయడం, నకిలీ నియామక పత్రాలు చూపించడం వంటి మోసం చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలనీ పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
