
సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన సింగారపు యాదగిరిస్వామి తిరుమలగిరిలో తనకున్న భూమితో పాటు మరికొంత భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచేశాడు. ఆంధ్ర వ్యక్తి నుండి పత్తి విత్తనాలు కొనీ సేద్యం చేసి ఆశించిన పంట రాక నష్టపోయాడు. దీంతో పెట్టిన పెట్టుబడి తిరిగి సంపాదించేందుకు అదే నకిలీ అస్త్రాన్ని ఆసరా చేసుకున్నాడు. పత్తి నుంచి గింజలు వేరుచేసి, వాటిని పత్తి విత్తనాలుగా తయారుచేయవచ్చని యూట్యూబ్ లో చూశాడు. పత్తి విత్తనాలు తయారు చేసే మిషన్ ను కొనుగోలు చేశాడు. ఓ మోటార్, ప్లాస్టిక్ డ్రమ్, 15 సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్లు, పత్తి గింజల రంగు వచ్చేందుకు షైనా స్టార్ డబ్బాలను తీసుకువచ్చి కౌలుకు తీసుకున్న పొలంలో 308 కిలోలకు పైగా అసలు పోలిన నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి ప్యాకింగ్ చేశాడు. ఈ విత్తనాలు కలుపు , చీడపీడల బాధను తట్టుకునే బీటీ విత్తనాలని రైతులను నమ్మించాడు.
యాదగిరి స్వామి.. తనకు తోడుగా నందాపురానికి చెందిన నవీన్, చిర్రగూడూరుకు చెందిన సోమనారాయణల సహకారం తీసుకున్నాడు. వీరికి రూ.1500 చొప్పున 10 కిలోలు విక్రయించాడు. వారిద్దరు కలిసి సమీప గ్రామాల్లో తమకు పరిచయమున్న రైతులకు అధిక ధరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తక్కువ ధరకు పత్తి విత్తనాలు లభిస్తుండడంతో ఆయా గ్రామాల్లోని రైతులు మరిన్ని కావాలని అడిగారు. దీంతో నవీన్, సోమనారాయణలు మళ్లీ పత్తి విత్తనాలు కావాలని యాదగిరిస్వామిని కోరారు. దీంతో యాదగిరి స్వామి తాను కౌలుకు తీసుకున్న పొలంలో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేశాడు. నవీన్ కు 50 కిలోలు, సోమ నారాయణకు 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు విక్రయించాడు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం నకిలీ విత్తనాలపై నిఘా పెట్టింది. పక్కా సమాచారంతో సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, తిరుమలగిరి పోలీసులు యాదగిరి స్వామి కౌలుకు తీసుకున్న భూమిలో తనిఖీలు చేశారు. యాదగిరి స్వామి నకిలీ పత్తి విత్తనాలను తయారుచేస్తూ పట్టు బడ్డాడు. యాదగిరి స్వామికి సహకరించిన నవీన్ సోమనారాయణలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి రూ.4.62 లక్షల విలువైన 308కేజీల నకిలీ పత్తి విత్తనాలు, ఓ మోటార్, ప్లాస్టిక్ డ్రమ్, 15 సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్లను
స్వాధీనం చేసుకున్నారు. యాదగిరి స్వామి తన నష్టాలను పూడ్చుకునేందుకు యూట్యూబ్ లో చూసి నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి విక్రయించాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చెబుతున్నారు. నకిలీ విత్తనాలను తయారుచేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ
హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను గుర్తిం చేందుకు టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని ఆయన చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..