నాడు ప్రియుడి కోసం భర్తను చంపింది.. నేడు అతడే యముడయ్యాడు.. మరో ప్రియురాలితో కలిసి..
నాగర్‌కర్నూల్ జిల్లాలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. 2016లో ప్రియుడు రాములతో కలిసి తన భర్తను హత్య చేసిన పార్వతమ్మ, అనంతరం అదే వ్యక్తితో కలిసి జీవనం సాగించింది. అయితే కాలక్రమంలో రాములు మరో మహిళ లక్ష్మితో సంబంధం పెట్టుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి. పార్వతమ్మను అడ్డుగా భావించిన రాములు, లక్ష్మితో కలిసి పథకం ప్రకారం ఆమెకు మద్యం తాగించి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారు.

వివాహేతర బంధాల పేరుతో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. భార్యను భర్త, భర్తను భార్యను విభిన్న రీతిలో దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక నాడు ప్రియుడుతో కలిసి భర్తను చంపింది. ఆ తర్వాత ఇద్దరు జైలు జీవితం గడిపారు. సీన్ కట్ చేస్తే అదే ప్రియుడు మరో మహిళతో సంబంధం కారణంగా ఈమెను కిరాతకంగా హత్య చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మొగుతల్ల పార్వతమ్మ కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 2012 నుంచి అదే గ్రామానికి చెందిన సంకి రాములుతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త మల్లయ్యను 2016 లో పార్వతమ్మ, అమె ప్రియుడు రాములు హత్య చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు సైతం పంపారు. ఇక జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత మళ్లీ కలిసి జీవనం కొనసాగించారు. ఈ క్రమంలో కొన్నాళ్లు వీరి సంసారం బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక అటు పార్వతమ్మ కుమారుడు, ఇటు రాములు పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో వీరి వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరిని మందలించారు. దీంతో ఇద్దరు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీకి మకాం మార్చారు. అక్కడే ఉండి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కూలీ పనుల వద్ద మరో మహిళతో పరిచయం:
అయితే కూలీ పనుల వద్ద సంకి రాములుకు లక్ష్మీ అనే మహిళ పరిచయం అయ్యింది. ఆమె రెండేళ్లుగా భర్తకు దూరంగా ఒంటరిగా జీవిస్తూ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతోంది. వీరి పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారీ తిసింది. విషయం పార్వతమ్మకు తెలియడంతో పలుమార్లు లక్ష్మీ నివాసానికి వెళ్లి పెద్ద గొడవ చేసింది. నాటి నుంచి పార్వతమ్మపై రాములు, లక్ష్మీ ఇద్దరు ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైన ఆమెను మట్టుబెట్టి మన కాపురం కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ముందుగానే పార్వతమ్మను హత్య చేయాలని రాములు, లక్ష్మీ ప్లాన్ వేసుకున్నారు. ఈ నెల 25 సాయంత్రం 7 గంటలకు మద్యం, కత్తి తీసుకొని లక్ష్మీ నివాసానికి వెళ్లి ఇరువురు మద్యం తాగారు. అనంతరం ఇద్దరు బైక్ పై పాలెం గ్రామానికి వెళ్లారు. అక్కడ మళ్లీ కొనుక్కోని మరోసారి మద్యం తాగారు.. ఆ తర్వాత లక్ష్మీని పాలెం గ్రామంలోని వదిలి… రాములు ఖానాపూర్ లో ఉన్న పార్వతమ్మ నివాసానికి వెళ్లి.. ఉయ్యలవాడ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పార్వతమ్మకు ఎక్కువ మోతాదులో మద్యం తాగించి.. ఖానాపూర్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్దకు బైక్ పై తీసుకెళ్లాడు. రాత్రి సుమారు గం.11.00ల సమయంలో అక్కడే పార్వతమ్మతో శారీరకంగా కలిశాడు. అనంతరం పార్వతమ్మ అక్కడే నిద్రించింది. రాములు తన పనిలో తాను బిజీ గా ఉండగా లక్ష్మీ ఖాళీగా ఉండి ఏం చేయాలని చోరికి పాల్పడింది. రోడ్డు ప్రక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిద్రిస్తున్న మహిళ కాళ్లకు ఉన్న 20తులాల వెండి పట్టీలు చోరి చేసింది. ఈ లోపు రాములు నుంచి ఫోన్ కాల్ రావడంతో అక్కడికి వెళ్లిపోయింది. సుమారు గం.12.30 నిమిషాలకు పార్వతమ్మ గాఢ నిద్రలో ఉండగా హత్య స్కెచ్ ను రాములు, లక్ష్మీ అమలు చేశారు. మొదట రాములు పార్వతమ్మ తలపై కర్రతో బలంగా కొట్టాడు. ఆ తర్వాత పార్వతమ్మ కాళ్లను లక్ష్మీ అదిమి పట్టుకోగా… రాములు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి చంపేశాడు. పార్వతమ్మ కాళ్లకు ఉన్న రెండు వెండి కడియాలు, బంగారు చెవి కమ్మలు, మొబైల్ ఫోన్ ను లక్ష్మీ తీసుకుంది.
అగ్గిపెట్టె తీసుకొచ్చి దహనం:
ఇక డెడ్ బాడీని పడేయడానికి స్థలం వెతుకుతుండగా సమీపంలో మొక్కజోన్న పంట వ్యర్థాల కుప్ప కనిపించింది. దీంతో పార్వతమ్మ మృతదేహాన్ని ఆ కుప్పలో పడేసి దహనం చేయాలని రాములు, లక్ష్మీ నిర్ణయించారు. అక్కడి నుంచి మళ్లీ నాగర్ కర్నూల్ లోని నివాసానికి వెళ్లి రక్తపు మరకల దుస్తులు మార్చుకోని బంగారు, వెండి ఆభరణాలు అక్కడే దాచారు. ఆ తర్వాత అగ్గిపెట్టెతో తెల్లవారుజామున గం.4.00లకు వెళ్లి పార్వతమ్మ డెడ్ బాడీని మొక్కజోన్న పంట వ్యర్థాల కుప్పలో పడేసి దహనం చేశారు. ఇక ఉదయం స్థానికులు మంటల నుంచి వస్తున్న దుర్వాసనను గమనించి వెళ్లి చూడగా మహిళ చేయి, గాజులు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనస్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు. డెడ్ బాడీ చేయి, గాజులు మినహా పూర్తిగా దహనమయ్యింది. అయితే లభించిన ఆధారాలతో మృతురాలు పార్వతమ్మగా గుర్తించారు. ఆతర్వాత దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు సంకి రాములు, లక్ష్మీ ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
