Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్.. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే ఈ రైతన్నలు ఏం చేశారంటే..? వీడియో ఇదిగో
పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ఎల్‌నినో తెలంగాణ అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆకాశం వైపు చూస్తే వాన జాడ లేదు.. ప్రాజెక్టుల్లో చూస్తే నీటిమట్టాలు అడుగంటాయి. వర్షాలు లేక జల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం, విపరీతమైన ఎండలతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు మొదలయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుంటే దానిని బతికించుకునేందుకు రైతన్నలు ఆపసోపాలు పడుతున్నారు.

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. రుతుపవనాలు ముఖం చాటేయడంతో వానాకాలం సీజన్‌లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం భారీగా పడిపోగా, ఉన్న కొద్దిపాటి పంటను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల ఆధారిత వ్యవసాయం ఎక్కువగా ఉండే ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఎల్‌నినో పిడుగులా పడింది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో ఉంటుంది. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సి వచ్చింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ ఉమ్మడి జిల్లాలో కేవలం ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేపట్టారు. సాధారణ రోజుల్లో కాల్వలు, చెరువులు నిండితే సాగు సాఫీగా సాగేది, కానీ వర్షాలు లేకపోవడంతో జిల్లాలోని 25 లక్షలకు పైగా ఉన్న బోరుబావులపైనే రైతాంగం పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జల విద్యుత్ ఉత్పత్తికి ఎల్‌నినో బ్రేక్.. రికార్డు డిమాండ్
ఎల్‌నినో సృష్టించిన విపరీతమైన వేడి, తీవ్ర వర్షాభావం కారణంగా రాష్ట్రంలో ఊహించని రీతిలో విద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అడుగంటడంతో జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఉత్పత్తి తగ్గి, వ్యవసాయానికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో క్షేత్రస్థాయిలో సరఫరా సమతుల్యత దెబ్బతింటోంది. బోరుబావులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ పెరిగి లో వోల్టేజ్ సమస్యలు, సాంకేతిక అంతరాయాలు తప్పడం లేదు. ఫలితంగా బోర్లు ఉన్నప్పటికీ పంటలకు అవసరమైన సమయంలో నీరందక చేలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.
పంటను కాపాడుకునేందుకు జనరేటర్ల బాట.. ఆర్థిక భారం
పంట కీలక దశకు చేరిన సమయంలో నీరు అందకపోతే దిగుబడి పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో ఎల్‌నినో తెచ్చిన నీటి ఎద్దడి నుంచి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు భారీ జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. అద్దెకు జనరేటర్లు తెచ్చి, వాటి ద్వారా బోరు మోటార్లు నడిపిస్తున్నారు. జనరేటర్ అద్దెతో పాటు లీటర్ల కొద్దీ డీజిల్ వాడాల్సి రావడంతో రోజుకు ఎకరాకు దాదాపు రూ. 3,000 వరకు అదనపు ఖర్చు అవుతోంది.
అప్పుల ఊబిలో అన్నదాత
ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాలు లేక పెట్టుబడులు పెరిగిపోయాయి. ఇప్పుడు పంట చివరి దశలో నీటి తడులు అందించడానికి చేస్తున్న డీజిల్ ఖర్చులు రైతులకు తలకుమించిన భారంగా మారాయి. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంటను కళ్లముందే ఎండనివ్వలేక అప్పులు చేసి మరీ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఎల్‌నినో పరిణామం.. నేడు నేరుగా గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ రైతు నడ్డి విరుస్తోంది.
