AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న టికెట్ల ధరలు..

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సీఈఓ కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో టికెట్ల ధరలను పెంచక తప్పదని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలే దీనికి కారణమని అంటున్నారు. అలాగే రూపాయి విలువ క్షీణించడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. జెట్ ఇంధన ధరలు పెరగడం వల్ల తమ సంస్థపై అధిక భారం పడుతుందని చెప్పారు.

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న టికెట్ల ధరలు..
Indigo
Venkatrao Lella
|

Updated on: Oct 30, 2026 | 9:26 AM

Share

విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఇండిగో టికెట్ ధరలను మరింత పెంచేందుకు సిద్దమవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ధరలను పెంచగా.. అదనంగా మరికొంత పెంచేందుకు రెడీ అవుతోంది. దీనికి కారణంగా జెట్ ఇంధన ధరలు పెరగడమేనని చెప్పుకొవచ్చు. జెట్ ఇంధన ధరల పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వల్ల ఇండిగో తీవ్ర నష్టాలను మూటకట్టుకుంటుంది. దీంతో టికెట్ ధరలను పెంచడమే మార్గంగా చూస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌లైన్ రూ.1,879 కోట్ల నికర నష్టాన్ని మూటకట్టుకోగా.. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,582 కోట్ల నష్టం తగ్గుముఖం పట్టింది. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల జెట్ ఇంధనం ధర భారీగా పెరిగింది. దీంతో ఇండిగో ఇంధన బిల్లు గతేడాదితో పోలిస్తే ఏకంగా 67.2 శాతం పెరిగి రూ.9,967 కోట్లకు చేరింది. దీని వల్ల సంస్థకు నష్టాలు మరింత పెరుగుతున్నాయి.

పెరగనున్న ఇండిగో టికెట్ రేట్లు..!

టికెట్ ఛార్జీలు పెంచడంతో పాటు ఇంధన సర్‌ఛార్జీలు విధించినప్పటికీ.. ఇంధన బిల్లులో కేవలం 60 శాతం మాత్రమే ఇండిగో రాబట్టగలిగింది. అయితే నష్టాలను చవిచూస్తున్న తరుణంలో ఛార్జీలను మరింత పెంచాల్సి ఉంటుందని సీఈవో వాల్ష్ తాజాగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇంధన ధరల పెరుగుదలను ఎదుర్కొనేందుకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని కూడా సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. ఇంధన బిల్లులో పెరుగుదలను భర్తీ చేసేందుకు ఛార్జీలను పెంచడం తప్ప తమకు వేరే మార్గం లేదని వాల్ష్ తేల్చిచెప్పేశారు. అయితే రెండో త్రైమాసికంలో పనితీరు చాలా ప్రోత్సాహకరంగా ఉందని తాను భావిస్తున్నానని, ఇంధన ఛార్జీల పెరుగుదలను తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంటున్నామని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితుల వల్ల విమానయాన సంస్థలు అధిక చమురు ధరలను ఎదుర్కొంటున్నాయని, నిర్వహణ ఖర్చులలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వాటా ఎక్కువ ఉందని పేర్కొన్నారు.

ముడి చమురుతో పోలిస్తే జెట్ ఇంధనానికి అసాధారణంగా అధిక ప్రీమియం ఉంటుంది. దీనిని ‘క్రాక్ స్ప్రెడ్’గా పిలుస్తారు. అత్యధిక ‘క్రాక్ స్ప్రెడ్’ అంటే ముడి చమురు, జెట్ ఇంధనం మధ్య ఉన్న ప్రీమియం. ఈ సంవత్సరం ఇది సగటున 65 శాతానికి చేరింది. రాబోయే కొద్ది నెలల పాటు ఇంధన ధరలు అధికంగా ఉండే అవకాశముంది. అలాగే రూపాయి విలువ తగ్గడంతో విదేశీ మారకపు హెచ్చుతగ్గులు ఇండిగోకు ఖర్చులను అధికం చేస్తున్నాయి. పెరిగిన ఖర్చులో ఎంత మొత్తాన్ని వినియోగదారులపై వసూలు చేయవచ్చనే దానిపై ఇండిగో సమాలోచనలు జరుపుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఇండిగో విమానయాన ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది విమాన ప్రయాణికులపై భారాన్ని మోపనుందని చెప్పవచ్చు.

Follow Us