AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: మరో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఏపీలో భారీ వర్షాలు కురవనుండగా.. తెలంగాణలో ఓ మోస్తరు వానలు పడనున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. అల్పపీడనం.. వాయుగండంగా మారే అవకాశముందని తెలిపింది.

Rain Alert: మరో వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..
Ap And Telangana
Venkatrao Lella
|

Updated on: Oct 30, 2026 | 7:45 AM

Share

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీ అతలాకుతలం అవుతోంది. బలమైన ఈదురుగాలులు, అతి భారీ వర్షాల కారణంగా రోడ్లు, ఇళ్లు, పంటలు భారీగా దెబ్బతిన్నాయి. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తుండగా.. తాజాగా వాతావరణశాఖ మరో అలర్ట్ జారీ చేసింది. అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఏపీలో రాబోయే వారం రోజుల పాటు వానలు పడనున్నాయి.

ఏపీకి భారీ రెయిన్ అలర్ట్..

శుక్రవారం అల్లూరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ.. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే భారీ వర్షాలు పడుతుండటంతో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఇక్కడ నివసించే నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. పొంగిపొర్లే కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, ఈతకు వెళ్ళవద్దని సూచించింది. అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నందున నవంబర్ 1, 2 తేదీలలో కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయని విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది. రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కాగా అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా సీఎ చంద్రబాబు పరిశీలించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ముంపు బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. అటు తుఫాన్ నష్టంపై అంచనా వేసేందుకు నేడు కేంద్ర బృందం ఏపీకి రానుంది.

తెలంగాణలో ఈ జిల్లాలకు వర్షసూచన

ఇక తెలంగాణకు కూడా హైదరాబాద్ వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

Follow Us