దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణపై అభ్యంతరకరం తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఈడీ. తమ వాదనలు వినకుండా కవిత పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయద్దని అత్యున్నత న్యాయస్థానంలో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్‌లో కోరింది ఈడీ. కాగా ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరఫున న్యాయవాదులు వివరించారు. ఫోన్ సీజ్ వ్యవహారాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత నోటీసుల్లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కవిత. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు విచారణ నుంచి కూడా మినహాయింపు కోరారు కవిత. దీనిపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పుడీ పిటిషన్‌కు వ్యతిరేకంగానే సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఈడీ.
కాగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత శుక్రవారం (మార్చి17)న ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఢిల్లీలోనే ఉన్న ఆమె అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. దీంతో కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. 20న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..