Sandeep Shandilya: చెత్త అమ్ముకునే వ్యక్తితో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ స్నేహం… ఎందుకంటే..!
దేశవ్యాప్తంగా నడుస్తున్న నైజీరియన్ డ్రగ్ కార్టెల్‌ను ఛేదించడంలో తెలంగాణ ఈగల్ టీమ్–ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా పెద్ద విజయం సాధించారు. ఈ ఆపరేషన్‌కు కేంద్రబిందువైన ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఏకంగా ఏడు రోజుల పాటు మారువేషంలో ఢిల్లీ ఉమన్గడ్ ప్రాంతంలోని నైజీరియన్ డ్రగ్ డెన్లో ఉండి కీలక సమాచారాన్ని సేకరించారు.

ఢిల్లీని కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా నడుస్తున్న భారీ నైజీరియన్ డ్రగ్ కార్టెల్ గుట్టును తెలంగాణ ఈగల్ టీమ్–ఢిల్లీ పోలీసులు కలిసి ఛేదించారు. ఈ భారీ ఆపరేషన్ వెనుక కీ రోల్ పోషించింది.. ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఆయన చేపట్టిన అద్భుతమైన అండర్‌కవర్ మిషన్ కారణంగా ఈ ముఠా గుట్టు రట్టైంది. నైజీరియన్ డ్రగ్ డెన్ మూలాలను బయటకు తీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజుల పాటు మారువేషంలో ఉమన్గడ్ ప్రాంతంలో నైజీరియన్ల మధ్యే గడిపారు. చెత్త ఏరుకునే వ్యక్తితో స్నేహం పెంచుకుని, ఆ వ్యక్తి సహకారంతో అక్కడి డ్రగ్ డెన్‌లోకి ఎంటరయ్యి సమాచారం సేకరించారు. అద్దె రూమ్ కోసం వచ్చానని చెప్పి వారం రోజుల పాటు అక్కడే తిష్టవేసి స్థానికుడిలా కలిసిపోవడంతో డ్రగ్స్ కింగ్‌పిన్ బద్రుఖాన్ ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించారు. ఈ నెట్వర్క్‌కు మద్దతుగా 502 మంది నైజీరియన్లు కలిసి డ్రగ్ డెన్ నడుపుతున్నారని ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది.
ఈ సమాచారాన్ని ఈగల్ డైరెక్టర్ నేరుగా ఢిల్లీ డిజిపి, క్రైమ్ బ్రాంచ్ అధికారులకు అందించడంతో భారీ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. తర్వాత ఈగల్ టీమ్‌లోని 124 మంది అధికారులు, ఢిల్లీ సీసీఎస్‌లోని 120 మంది సిబ్బందితో కలిసి ఢిల్లీలో 20 ప్రాంతాల్లో, ఒకేసారి 300 మంది పోలీసులు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా అరెస్ట్ కాగా..రూ.3.5 కోట్లు విలువ చేసే 5340 ఎక్స్టసీ పిల్స్, కొకైన్, హెరాయిన్, మేథ్ వంటి మత్తుమందులు సీజ్ చేశారు. కార్టెల్ ఉపయోగించిన 59 ‘మ్యూల్ అకౌంట్స్’ గుర్తించి, 107 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 2078 మందికి పైగా ఈ నెట్వర్క్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది అని అధికారులు వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్, ఇతర కొరియర్ కంపెనీల ప్యాకేజీల్లో డ్రగ్స్ దాచిపెట్టి పంపుతున్నట్లు అధికారులను గుర్తించారు. కొత్త వ్యక్తులు వెళితే నైజీరియన్లు గుర్తుపడతారని, అందుకే ఈగల్ టీమ్ చెత్త ఏరుకునే వ్యక్తిని ఎంగేజ్ చేసి, అతని ద్వారా వివరాలు తెలుసుకోవడం… ఈ ఆపరేషన్ విజయానికి కీలకం అయింది. చెత్త ఏరుకునే వ్యక్తితో నేరుగా ఈగల్ డైరెక్టర్ మాట్లాడారు.
ఈ నెట్వర్క్‌కు ప్రధాన సూత్రధారి అయిన బద్రుద్దీన్‌ను కూడా అరెస్ట్ చేసి, అతని మ్యూల్ అకౌంట్ల ద్వారా 15 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన వైజాగ్‌కి చెందిన ముగ్గురు మహిళా స్మగ్లర్‌లు సహా దేశవ్యాప్తంగా పలుమంది పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో.. ఢిల్లీ కేంద్రంగా నడిచిన ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్‌ను పూర్తిగా కూపీ లాగి.. అధికారులు విజయం సాధించారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారుల ప్రత్యేక నిఘా కొనసాగనుంది.
