Telangana: ఆ రహదారి యమలోకానికి ‘బైపాస్ రోడ్’.. ప్రయాణించేందుకు జంకుతున్న ప్రజలు

అది రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన జాతీయ రహదారి. దానిపై నిత్యం వేలకొద్దీ ప్రయాణీకులు వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలు అరచేతలో పట్టుకోవాల్సిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లా మీదుగా..

Telangana: ఆ రహదారి యమలోకానికి 'బైపాస్ రోడ్'.. ప్రయాణించేందుకు జంకుతున్న ప్రజలు
Representative Image
Follow us
P Shivteja

| Edited By: Ravi Kiran

Updated on: Mar 02, 2024 | 5:08 PM

అది రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన జాతీయ రహదారి. దానిపై నిత్యం వేలకొద్దీ ప్రయాణీకులు వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలు అరచేతలో పట్టుకోవాల్సిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లా మీదుగా ఉన్న నాందేడ్- అకోలా నేషనల్ హైవే నెంబర్-161 ప్రయాణికులకు దడ పుట్టిస్తోంది. కొత్తగా ఫోర్ లైన్ హైవే నిర్మాణం పూర్తయిన తర్వాత తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు, కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్లు లేకపోవడం, వెహికల్స్​ రాంగ్ రూట్‌లో వెళ్తుండటం, టోల్ గేట్ ఎత్తేశాక రోడ్డు మధ్యలోనున్న సిమెంట్ డివైడర్లు తొలగించకపోవడం వంటివి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి ఆరుగురు చనిపోయారు. రెండు నెలల్లో సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 18 మంది మృత్యు ఒడికి చేరారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

నాందేడ్- అకోలా హైవే ఫోర్​లైన్ ​రోడ్డుగా డెవలప్ ​చేశాక వెహికల్స్ ​చాలా స్పీడ్​గా వెళ్తున్నాయి. ఓవర్​ స్పీడ్​, ఓవర్ ​టేక్ ​చేస్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. బ్రిడ్జిలు, గ్రామాలకు వెళ్లే రూట్లు ఉన్నచోట సరైన సూచిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. మెదక్ జిల్లా పరిధిలో కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్​లు లేకపోవడం వల్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తోందని వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్తుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అల్లాదుర్గం నుంచి గడి పెద్దాపూర్​ మధ్యలో హైవే పక్కన బెల్ట్​షాప్ ఉంది. పరిసర గ్రామాల నుంచి మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్తున్న వాహనదారులు హైవే మీద రాంగ్​రూట్​లో ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

పెద్ద శంకరంపేట మండలం కోళ్లపల్లి వద్ద టోల్‌గేట్ ఎత్తేశాక.. అక్కడ రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ డివైడర్లు తొలగించకపోవడం కూడా ప్రమాదాలకు మరొక కారణంగా మారింది. రాత్రివేళ హైవే మీద స్పీడ్​గా వస్తున్న వెహికల్స్ ​డివైడర్లను గుర్తించక.. వాటిని ఢీకొట్టి ప్రమాదాలకు గురవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 161వ నేషనల్ హైవే మీద గడిచిన రెండు నెలల్లో ఐదు ప్రమాదాలు జరిగి ఏడుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. మూడు రోజుల క్రితం ఇదే హైవేపై సంగుపేట వద్ద బైకు, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. తాజాగా ఫిబ్రవరి 26వ తేదీ అర్ధరాత్రి ఆందోల్​ మండల పరిధి మాసానిపల్లి బ్రిడ్జి కింద రోడ్డు పక్కన కారు ఆపి మూత్ర విసర్జన చేస్తున్నవారిని టిప్పర్​ లారీ ఢీ కొట్టగా.. జోగిపేటకు చెందిన వాజీద్, హాజీ, ఉక్రాన్ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు యువకులు గాయపడ్డారు. మెదక్ జిల్లా పరిధిలో టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల పరిధిలో నేషనల్​ హైవే మీద గడిచిన 2 నెలల్లో 11 ప్రమాదాలు జరిగి 9 మంది మృతి చెందారు. ఈ నెల 20వ తేదీన అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ వద్ద బైక్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. పెద్ద శంకరంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు గడిపెద్దాపూర్ ఫ్లైఓవర్‌పై రాంగ్ రూట్​లో వస్తున్న బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న పాపన్నపేట్ మండలం బాచారం గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్, భీమయ్య, శ్రీకాంత్ స్పాట్‌లోనే చనిపోయారు. మానస్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి వద్ద ఆయిల్ ​ట్యాంకర్ ​బోల్తాపడి డ్రైవర్​ కియారాం స్పాట్​లోనే చనిపోయాడు.

ఈ రోడ్డుపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేషనల్​ హైవే అథారిటీ అధికారులు, పోలీసులు జాయింట్​గా సర్వే చేసి నేషనల్ ​హైవే మీద ఎక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయంపై అధ్యయనం చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అవసరమైన చోట ఎగ్జిట్ ​పాయింట్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి వెహికిల్స్​ ఏవీ రాంగ్​ రూట్‌లో వెళ్లకుండా చూడాలి. కోళ్లపల్లి వద్ద నిరుపయోగంగా ఉన్న టోల్​గేట్ ​వద్ద, హైవే మధ్యలో ఉన్న డివైడర్లను తొలగించాలని కోరుతున్నారు వాహనదారులు.