Telangana: వేటకు వెళ్లిన జాలర్లకు నీటిలో తేలుతూ కనిపించాయ్.. ఏంటా అని వెళ్లి చూడగా..
నల్గొండ జిల్లా పిఎ పల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్‌లో శుక్రవారం నాడు చనిపోయిన కోళ్లు తేలుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బర్డ్ ఫ్లూ భయంతో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోళ్లను జలాశయంలోకి వదిలేసి ఉంటారని అధికారులు దర్యాప్తు చేయగా.. అదే నిజమని తేలింది.

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ దడ పుట్టిస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ వేలల్లో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన బ్రాయిలర్ కోళ్లు కనిపించడం కలకలం రేపింది. కోళ్ల కళేబరాలు నీటిపై తేలుతుండటం ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ జలాశయం నుంచే సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటుగా.. దాదాపు 600 గ్రామాలకు తాగునీరు అందుతోంది. దీంతో నగరవాసులు, ఆయా గ్రామాల ప్రజలు.. ఆ నీరు తాగితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని టెన్షన్ పడుతున్నారు.
శుక్రవారం పొద్దున్న వేట వెళ్లేందుకు సిద్దమైన జాలర్లు.. సమీపంలో ఏవో తేలుతూ ఉండటం గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా.. అవి చచ్చిన కోళ్లుగా నిర్ధారించారు. వెంటనే సమాచారాన్ని రిజర్వాయర్ అధికారులకు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న దేవరకొండ RDO రమణారెడ్డి, ఇరిగేషన్ DE నాగయ్యతో స్పాట్‌కి చేరుకుని, జాలర్ల సహాయంతో 60 చనిపోయిన కోళ్లను జలాశయం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇంకా ఎక్కడైనా కోళ్ల కళేబరాలు ఉన్నాయేమో అన్న అనుమానంతో డ్రోన్‌తో సర్వే చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు సమీపంలో కోళ్ల ఫారాలను పరిశీలించారు. రమావత్ రాయమల్లు అనే కోళ్ల ఫాం నిర్వాహకుడు వీటిని నీటిలో పడవేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. పడమటి తండాకు చెందిన రాయమల్లు.. పుట్టంగండి నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌కు వచ్చే కెనాల్ సమీపంలో కోళ్ల ఫామ్ ఉంది. ఇటీవల అతని ఫారంలో 100 కోళ్లు చనిపోగా.. 40 కోళ్లను పాతిపెట్టాడు. మిగిలిన 60 కోళ్లను రిజర్వాయర్‌కు వచ్చే కాలువలో పడేసినట్లు గుర్తించారు.

Dead Chicken
ఆ రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని తాగేందుకు సమీప గ్రామాల ప్రజలు జంకుతున్న నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సరఫరా చేయడానికి ముందు కోదండపూర్ వాటర్ ప్లాంట్‌లో శుద్ధి చేస్తారని HMWSSB ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. ISI ప్రమాణాల ప్రకారం నీటి సరఫరాకు 3-దశల క్లోరినేషన్ చేస్తామని చెప్పారు. వాటర్ శాంపిల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్ (QAT), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM)కు పంపనట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




