AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముళ్లపొదల్లో నుంచి శిశువు ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూడగా ఊహించని సీన్..

అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ చిన్నారిని.. ముళ్లపొదల్లో పడేశారు. నవమాసాలు మోసిన కన్నతల్లే కర్కశంగా ఆడశిశువును వదిలించుకోవాలనుకుంది. కోదాడ మండలంలో మాతృత్వానికే మచ్చతెచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. పొలంలో పనికి వెళ్లిన కూలీలకు ఆ పసిపాప ఏడుపు వినిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Telangana: ముళ్లపొదల్లో నుంచి శిశువు ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూడగా ఊహించని సీన్..
Abandoned Newborn Rescued In Suryapet
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 2:05 PM

Share

మాతృ ప్రేమ మలినమవుతోంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డను పెంచుకోవడానికి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటుంది. తన శక్తినంతా ధారపోసి మరీ తన బిడ్డను పెంచుకుంటుంది. కానీ కాలంలో వచ్చిన మార్పులతో కన్నపేగును తల్లి వదిలించుకుంటుంది. హాయిగా తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్ర పోవాల్సిన ఆడ శిశువును కన్న తల్లి కనికరం లేకుండా కర్కశంగా ముళ్ళ పొదల్లో పడేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో దారుణం చోటుచేసుకుంది. కోదాడ నుండి మేళ్ళచెరువుకు వెళ్లే రహదారి నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. గుడిబండలోని బ్రిక్స్ కంపెనీలో పనిచేసే కార్మికులు ఎదురుగా పొలంలో కలుపు తీయడానికి వెళ్లారు. ముళ్ల పొదల్లో అరుపులు వినిపించాయి. దీంతో ముళ్ళ పొదల్లోకి వెళ్లి చూసిన కూలీలు షాక్ తిన్నారు.

అప్పుడే పుట్టిన ఆడ శిశు గుక్క పట్టి ఏడుస్తోంది. ఆడ శిశువును ముళ్లపోదల్లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన విషయాన్ని కంపెనీ సూపర్వైజర్‌కు కూలీలు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముళ్ల పొదల్లోని శిశువుకు నోదుటి, శరీరంపై గాయాలు ఉన్నాయి. అంబులెన్స్‌లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆడ శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నవారా.. ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఆడ శిశువును వదిలి వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం కలిగించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us