AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరుకేమో అసిస్టెంట్ డైరెక్టర్.. రైలెక్కి ఏం చేస్తాడో తెలిస్తే షాకే!

సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఓ బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ రైళ్లలో ల్యాప్‌టాప్‌ బ్యాగులను చోరీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. జన్మభూమి, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లలో జరిగిన రెండు చోరీ కేసుల్లో నిందితుడిని నల్లగొండ రైల్వే పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

పేరుకేమో అసిస్టెంట్ డైరెక్టర్.. రైలెక్కి ఏం చేస్తాడో తెలిస్తే షాకే!
Assistant Director Arrested
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 03, 2026 | 9:27 AM

Share

సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలన్నది అతడి కల..! ఉన్నత చదువులు చదివి.. సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో విలాసాలకు అలవాటు పడిన ఆ యువకుడు అడ్డదారిని ఎంచుకున్నాడు. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం.. జీవితంలో మాత్రం అడ్డదారికి దర్శకత్వం వహించింది. కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలనుకుంటే చివరకు మిగిలేది కటకటాలే. సరిగ్గా ఇలాంటి దారినే ఎంచుకున్నాడు ఓ యువకుడు.

ఏపీ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన కడియం ప్రశాంత్. బీటెక్ పూర్తి చేసిన ప్రశాంత్‌కు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. దీంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొంత కాలం పనిచేశాడు. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. సినిమా రంగంలో తన కల నెరవేరక పోవడంతో మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికుల ల్యాప్‌టాప్‌లను అపహరించడం మొదలు పెట్టాడు.

రైళ్లే టార్గెట్.. ల్యాప్‌టాప్‌లే గురి..

రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్నాడు ప్రశాంత్. ముఖ్యంగా ల్యాప్‌టాప్ బ్యాగులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. గత నెల 30న రామకృష్ణ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సికింద్రాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వెళ్తున్న ఆయన తన ల్యాప్‌టాప్‌ను బ్యాగులో పెట్టి బోగీలో బెర్త్ కింద ఉంచాడు. అదే బోగీలో ఉన్న ప్రశాంత్.. ప్రయాణికుడు నిద్రిస్తున్న విషయాన్ని గమనించాడు. అదును చూసి ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగును తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు.

Assistant Director Turned Train Thief

Assistant Director Turned Train Thief

వరుస చోరీలు.. పోలీసులకు చిక్కిన నిందితుడు..

ఇదే తరహాలో అక్టోబర్ 31న మరో ఘటనకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ నుంచి పల్నాడు జిల్లా గురజాలకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరవింద్ ల్యాప్‌టాప్ బ్యాగును కూడా అపహరించాడు. ఇలా రెండు వేర్వేరు రైళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే వరుస చోరీలపై దృష్టి సారించిన నల్లగొండ రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర వివరాలను సేకరించి నిందితుడిగా ప్రశాంత్ ను గుర్తించారు. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని చోరీల గుట్టు రట్టు చేశారు. అతడి నుంచి చోరీకి గురైన ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నామని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ గౌడ్, జీఆర్పీ ఎస్ఐ ఎం. రాజు తెలిపారు.

రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. కలల ప్రపంచంలో దర్శకుడిగా ఎదగాలనుకున్న యువకుడు.. చివరకు దొంగతనాల కేసులో పోలీసులకు చిక్కడం ఈ ఘటనలో అసలు ట్విస్ట్. తెరపై కథలు రాయాల్సిన చేతులు.. రైళ్లలో ఇతరుల వస్తువులను కొట్టేసే స్థాయికి దిగజారాయి. ఉన్నత చదువులు, ఆశయాలు ఉన్నా.. వాటిని తప్పుదారి పట్టిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ ఘటన మరోసారి చాటిచెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us