AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్ర కోసం హోటల్ బుకింగ్.. చైనా తల్లుల కొత్త ట్రెండ్!

పిల్లలు పుట్టిన తర్వాత మహిళ జీవితం మారుతుంది. తమకంటూ కొంత సమయం కేటాయించుకోవడం కష్టంగా మారుతుంది. చైనాలో తల్లులు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాస్త ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఒత్తిడి నుంచి బయటపడటానికి సొంత డబ్బులతో హోటల్ గదులను బుక్ చేసుకుంటున్నారు. తమ అనుభవాలను సోషల్ మీడియాలో 'హోటల్ గెట్అవే డైరీల' పేరుతో పంచుకుంటున్నారు.

నిద్ర కోసం హోటల్ బుకింగ్.. చైనా తల్లుల కొత్త ట్రెండ్!
Chinese Working Mothers Book Hotel Rooms To Escape Stress Catch Up On Sleep
Sharada V
|

Updated on: Nov 03, 2026 | 9:21 AM

Share

చైనాలో ఉద్యోగం చేసే మహిళలు ఇంటి బాధ్యతల విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక బయటపెట్టింది. ఉద్యోగం చేసే తల్లుల్లో మూడింట ఒక వంతు మంది ఇంటి పనుల కోసం అదనంగా రెండు గంటలు కేటాయిస్తున్నారు. ఉద్యోగం చేసే తండ్రులతో పోలిస్తే తల్లులపైనే ఇంటి పనుల భారం ఎక్కువ.

సోషల్ మీడియాలో ‘హోటల్ గెట్ అవే డైరీలు’

చైనాలో హోటల్ గదులను బుక్ చేసుకుని నాలుగు గంటలు ఒంటరిగా గడుపుతున్న మహిళలు ‘హోటల్ గెట్అవే డైరీలు’ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొందరు ప్రశాంతంగా నిద్రపోతుంటే.. మరికొందరు పుస్తకాలు చదువుతూ, తమకు నచ్చిన పనులు చేసుకుంటున్నారు. రోజువారీ ఒత్తిడి నుంచి బయటపడేందుకు తమకు లభిస్తున్న అరుదైన అవకాశం అంటున్నారు. పిల్లలకు ఏ అవసరం వచ్చినా ముందుగా అమ్మనే పిలుస్తారని, దీంతో తమ కంటూ కొంత సమయం దొరకడం లేదని చెబుతున్నారు. ‘కుటుంబ సభ్యులు సహాయం చేయడానికి ముందుకు వచ్చినా పిల్లలు ప్రతిసారీ అమ్మనే పిలుస్తారు. మహిళలు మొదట మనుషులు ఆ తర్వాతే తల్లులు, ఉద్యోగినులు, భార్యలు. ఉద్యోగమే వారికి కాస్త విశ్రాంతి ఇచ్చే ప్రదేశం. ఇంటికి వెళ్లిన తర్వాత చేయాల్సిన పనుల జాబితా ఎప్పటికీ పూర్తికాదు’ అంటూ ఓ మహిళ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

తనకంటూ ఓ చిన్న ఇల్లు కొనుక్కున్న చైనా మహిళ

చైనాలో జియాంగ్సు ప్రావిన్స్‌ చాంగ్‌జౌ నగరానికి చెందిన గాంగ్ యాన్ కు వివాహమై ఓ కొడుకు ఉన్నాడు. ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న ఆమె 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఓ చిన్న ఫ్లాట్‌ను 5 లక్షల యువాన్లకు (రూ.57 లక్షలు) కొనుగోలు చేసింది. తన పొదుపు మొత్తాన్ని ఇందుకోసం ఖర్చు చేసింది. గాంగ్ యాన్ తన భర్త, కుమారుడు, అత్తమామలతో కలిసి ఓ ఇంట్లో ఉంటుంది. ఇంటి బాధ్యతలు, ఉద్యోగం మధ్య తనకంటూ సమయం లేకుండా పోయిందనీ తన కోసం ప్రత్యేకంగా ఓ స్థలం ఉండాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. తన పొదుపు డబ్బుతో ఓ చిన్న ఫ్లాట్‌ కొనుగోలు చేసింది. ఆ ఇంటి తాళాలు చేతికి వచ్చిన రోజు తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని సోషల్‌ మీడియా పోస్టులో తెలిపింది. ‘తాళాలు తీసుకున్న రోజు ఓ చిన్న కుర్చీపై కూర్చున్నాను. బయట నుంచి ఆహారం తెప్పించుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ గడిపాను. ఎంతో ఆనందంగా అనిపించింది’ అని గుర్తు చేసుకుంది.

చదువు, యోగా, స్నేహితులతో కబుర్లు

చిన్న ఫ్లాట్‌లో బెడ్‌రూమ్, వంటగది, బాత్రూమ్, వస్తువులు పెట్టుకునేందుకు ప్రత్యేక స్థలం ఉన్నాయి. ఇంటిని తన అవసరాలకు తగ్గట్టుగా సర్దుకుంది. పుస్తకాలు చదివేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఆ ఇంట్లో యోగా చేయడం, స్నేహితులతో టీ తాగుతూ కబుర్లు చెప్పడం ఆమెకు ఎంతో ఇష్టమట.

వారంలో రెండు రోజులు తనకోసమే

ప్రస్తుతం గాంగ్ వారంలో ఒకటి రెండు రోజులు ఆ చిన్న ఇంట్లో ఒంటరిగా గడుపుతుంది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకుని తనకు నచ్చిన పనులు చేసుకుంటోంది.  తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు మరింత ఉత్సాహంగా అనిపిస్తుందని గాంగ్‌ చెప్పింది. ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఆమె భర్త, కుమారుడు తన ఆహ్వానం మేరకే అక్కడికి వస్తుంటారు.  గాంగ్ యాన్ కథ చైనా సోషల్ మీడియాలో చాలామంది మహిళలను ఆకట్టుకుంది. గాంగ్ నిర్ణయంతో స్ఫూర్తి పొందిన ఆమె స్నేహితురాలు పెళ్లికి ముందే తనకంటూ ఓ ఫ్లాట్ కొనుక్కోవాలని ఆలోచిస్తోందట. కుటుంబం కోసం నిరంతరం శ్రమించే మహిళలకు వ్యక్తిగత జీవితం, ప్రశాంతంగా గడిపే సమయం అవసరమని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనాలో తగ్గుతున్న పెళ్లిళ్లు, జననాల రేటు

చైనాలో కుటుంబ బాధ్యతల ఒత్తిడి పెళ్లిళ్లు, పిల్లలను కనే విషయాలపై ప్రభావం చూపుతున్నాయి. 2021లో నిర్వహించిన సర్వేలో 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న 3,000 మంది అవివాహితుల్లో 44 శాతం మంది మహిళలు, 19 శాతం పురుషులు ఉన్నారు. అదే ఏడాది చైనాలో 1.062 కోట్ల మంది పిల్లలు జన్మించారు. ఇది 2020తో పోలిస్తే 11.5 శాతం తక్కువ. 2020 జనాభా లెక్కల ప్రకారం చైనాలో ప్రతి మహిళకు సగటున 1.3 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఈ సంఖ్య 2.1గా ఉండాలి. గాంగ్ యాన్ తీసుకున్న నిర్ణయం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతత, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత అవసరాన్ని చర్చకు తీసుకొచ్చింది. కుటుంబం కోసం కష్టపడుతూనే తమ కోసం కొంత సమయం కేటాయించుకోవాలనే సందేశాన్ని ఆమె ఇచ్చింది.

Follow Us