AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్క రశీదు నమ్మి ఘోరంగా మోసపోయిన ప్రజాప్రతినిధి! సర్పంచ్ ఖాతా ఖాళీ!

ఎదుటివారి ఆశనే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే అత్యాశను పెట్టుబడిగా మార్చుకుంటూ సామాన్యులనే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ సర్పంచ్ సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా రూ. 3.92 లక్షలు సమర్పించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఆ ఒక్క రశీదు నమ్మి ఘోరంగా మోసపోయిన ప్రజాప్రతినిధి! సర్పంచ్ ఖాతా ఖాళీ!
Sarpanch Duped By,gift Car Fraud,
P Shivteja
| Edited By: |

Updated on: May 30, 2026 | 12:00 PM

Share

ఎదుటివారి ఆశనే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే అత్యాశను పెట్టుబడిగా మార్చుకుంటూ సామాన్యులనే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ సర్పంచ్ సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా రూ. 3.92 లక్షలు సమర్పించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ‘లగ్జరీ కారు గిఫ్ట్ వచ్చింది, రూ. 80 లక్షల లోన్ మంజూరైంది’ అంటూ నకిలీ పత్రాలతో నమ్మించి ఈ భారీ మోసానికి తెరతీశారు.

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్‌కు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. “మీకు రూ. 80 లక్షల భారీ రుణం మంజూరైంది. అంతేకాదు, దాంతో పాటు ఒక లగ్జరీ కారు కూడా గిఫ్ట్‌గా వచ్చింది” అంటూ అవతలి వ్యక్తులు నమ్మబలికారు. సర్పంచ్‌కు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొన్ని నకిలీ లోన్ డాక్యుమెంట్లను సృష్టించి వాట్సాప్‌ లో పంపించారు. ఆ పత్రాలను చూసి సర్పంచ్ అది నిజమైన లోన్ అని నమ్మారు.

మొదట లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో సర్పంచ్ నుంచి రూ. 20 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత కేటుగాళ్లు మరో అడుగు ముందుకు వేసి, ఆయన బ్యాంక్ ఖాతాలో రూ. 20 లక్షలు జమ చేసినట్లుగా ఒక నకిలీ రశీదును సృష్టించి వాట్సాప్ చేశారు. ఆ రశీదును చూసిన సర్పంచ్, డబ్బులు నిజంగానే పడ్డాయని బలంగా నమ్మారు.

దీన్ని అదనుగా తీసుకున్న మోసగాళ్లు కొత్త నాటకానికి తెరలేపారు. మిగిలిన లోన్ డబ్బులు కూడా ఖాతాలో పడాలంటే సీబీఐ, పోలీసులు, ఇన్కమ్ టాక్స్ అధికారుల నుంచి క్లియరెన్స్ పర్మిషన్లు కావాలని, అందుకు ఫీజులు చెల్లించాలని నమ్మబలికారు. అది నిజమేనని నమ్మిన సర్పంచ్ వివిధ దఫాలుగా విడతల వారీగా మొత్తం రూ. 3.92 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు.

అంతటితో ఆగని కేటుగాళ్లు.. ఫైల్ క్లియర్ కావడానికి మరింత డబ్బు పంపాలంటూ మళ్ళీ డిమాండ్ చేయడంతో సర్పంచ్‌కు అనుమానం వచ్చింది. వెంటనే తన బ్యాంక్ ఖాతాను పరిశీలించుకోగా, ఎలాంటి డబ్బు జమ కాలేదని తెలిసి షాక్‌కు గురయ్యారు. తాను మోసపోయానని గ్రహించిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లాటరీ లేదా లోన్ వచ్చిందంటూ వచ్చే వాట్సాప్ మెసేజ్‌లను అస్సలు నమ్మవద్దు. సైబర్ సమాజంలో ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా, కొంతమంది అత్యాశకు పోయి ఇలా కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని, డబ్బులు పంపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us