Kamareddy: క్రెడిట్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పుగా ఉందని ఫోన్ కాల్.. కట్ చేస్తే
మీ ఆధార్ కార్డులోనో....క్రెడిట్ కార్డులోనో ఏదైనా మార్పు ఉందని ఫోనొస్తే వెనకాముందూ ఆలోచించకుండా వాళ్ళు చెప్పిందల్లా చేసేశారో..ఇక మీ జుట్టు సైబర్ నేరగాళ్ళు గుప్పిట్లో చిక్కుకున్నట్లే

క్రెడిట్ కార్డులు …ఆధార్ కార్డులూ… కరెంటు బిల్లులూ మాత్రమే కాదు..ఇప్పుడు …బర్త్‌డేట్‌లు సైతం సైబర్ మోసగాళ్ళ చేతికిచిక్కి, అమాయకుల నెత్తిన కుచ్చుటోపీగా మారి జనాన్ని హడలెత్తిస్తోంది. కామారెడ్డిజిల్లాలో గత రెండు రోజులుగా బయటపడుతున్న సైబర్ మోసాలు ప్రజల గుండెలు గుభేల్ మనిపిస్తున్నాయి. నిన్న గాక మొన్న కరెంటు బిల్లు కట్టలేదని, మూడు నెలల బిల్లు పెండింగ్‌లో ఉందని బెదిరించి, లింకుపంపి అకౌంట్లోనుంచి అచ్చంగా అరలక్ష కాజేసింది సైబర్ దొంగల ముఠా. ఈ ఘటని మరచిపోక ముందే తాజాగా క్రెడిట్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పుగా ఉందంటూ ఓ యాప్ ద్వారా ఏకంగా లక్ష రూపాయల సొమ్ముని అప్పనంగా నొక్కేసిన సైబర్ నేరగాళ్ళ కొత్త అవతారం కలకలం రేపుతోంది.
మీ ఆధార్ కార్డులోనో….క్రెడిట్ కార్డులోనో ఏదైనా మార్పు ఉందని ఫోనొస్తే వెనకాముందూ ఆలోచించకుండా వాళ్ళు చెప్పిందల్లా చేసేశారో..ఇక మీ జుట్టు సైబర్ నేరగాళ్ళు గుప్పిట్లో చిక్కుకున్నట్లే….సరిగ్గా కామారెడ్డి జిల్లాలో అదే జరిగింది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుభాష్ రావు కు చెందిన క్రెడిట్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పుగా ఉందని ఫోన్ చేశారు సైబర్ నేరగాళ్లు. డేటాఫ్ బర్త్ సరిచేయాలని, అందుకు ఓ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించారు. సుభాష్ రావు మొబైల్ లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న మరుక్షణం అతని ఖాతా నుంచి దాదాపు లక్షా ఏడువేల రూపాయలు(1,06,910)డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ రావడంతో సుభాష్ రావు షాకయ్యాడు. తిరిగి ఫోన్ నెంబర్ ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
మీరు కరెంటు బిల్లు కట్టలేదా? అది కట్టమని ఎవరైనా లింకు పంపితే ఎడాపెడా ఏమీ ఆలోచించకుండా లింక్ క్లిక్ చేశారో… మీ పని అయిపోయినట్టే…మీ అకౌంట్ ఖాళీ అవడానికి అరక్షణం పట్టదు. కామారెడ్డి జిల్లా మండలం దేవునిపల్లి కి చెందిన రాజేశ్వర్ కి ఇటీవల ఇలాగే శఠగోపం పెట్టారు సైబర్‌నేరగాళ్లు. మూడు నెలల కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ బెదిరించిన కేటుగాళ్ళు. వెంటనే చెల్లించకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ దమ్కీ ఇచ్చారు. ఓ లింక్ పంపి ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించాలని చెప్పడంతో దాన్ని ఓపెన్ చేశాడు రాజేశ్వర్. అంతే, అకౌంట్‌లో నుంచి 49వేల రూపాయలు డెబిట్ అయినట్టు మొబైల్‌కి మెసేజ్ ఇచ్చింది. దాంతో, మోసపోయాయని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సో తస్మాత్ జాగ్రత్త.. ఫోన్ చేతిలో ఉందికదాని ఏదిపడితే అదిడౌన్‌లోడ్ చేసేసుకోకండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
