AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదలైన చదువులు.. స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!

పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో, విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నియంత్రణపై విద్యాసంస్థలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మైనర్లు వాహనాలు నడపడం, పాఠశాల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంపై తీవ్ర హెచ్చరికలు చేశారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మార్షల్స్ ఏర్పాటు, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలపై అసెంబ్లీల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

మొదలైన చదువులు.. స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
Cp Sajjanar
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 8:20 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నియంత్రణ అంశాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విద్యాసంస్థల యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. రవీంద్రభారతిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, అలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే విద్యార్థుల వివరాలను సంబంధిత పాఠశాలలకు పంపిస్తామని, వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించే చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాల బస్సుల నిర్వహణ విషయంలోనూ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీపీ పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇటువంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అదేవిధంగా పాఠశాలల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ మార్షల్స్ లేదా వాలంటీర్ల నియామకం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజూ జరిగే స్కూల్ అసెంబ్లీల్లో ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, డిజిటల్ వ్యసనం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమని పేర్కొన్న సజ్జనార్, పేరెంట్-టీచర్ సమావేశాల ద్వారా సామాజిక సమస్యలు, పిల్లల భద్రత, బాధ్యతాయుత ప్రవర్తనపై అవగాహన పెంచాలని కోరారు. పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు కోప్టా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, విద్యాసంస్థలు కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us