AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్రకి శ్రీకారం.. జనవరి 31న ఆ జిల్లా నుంచి ప్రారంభం..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయసహకారాలతో పాలమూరు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలనే లక్ష్యంతో, జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్రకి శ్రీకారం.. జనవరి 31న ఆ జిల్లా నుంచి ప్రారంభం..
Congress
Ashok Bheemanapalli
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 29, 2024 | 9:00 PM

Share

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయసహకారాలతో పాలమూరు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలనే లక్ష్యంతో, జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. జనవరి 31న ఉదయం 10 గంటలకు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ గ్రామంలోని క్షీర లింగేశ్వర స్వామి మఠం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి దామోదర రాజనర్సిహ సమక్షంలో చల్లా వంశీచంద్ తొలి అడుగు వేసి పాలమూరు న్యాయయాత్రను ప్రారంభిస్తారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా.. ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల చొప్పున దాదాపు 25 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుంది.

ముందుగా మక్తల్ నియోజకవర్గంలో జనవరి 31 నుంచి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలిసి చల్లా వంశీచంద్ పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు నారాయణపేట్ నియోజకవర్గంలో, ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు దేవరకద్ర నియోజకవర్గంలో, ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు షాద్ నగర్ నియోజకవర్గంలో, ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు జడ్చర్ల నియోజకవర్గంలో, ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు మహబూబ్‌ నగర్ నియోజకవర్గంలో చల్లా వంశీచంద్ పాదయాత్ర చేయనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పాదయాత్ర తేదీలు ఖరారు చేస్తామని, ముగింపు సభకు ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చల్లా వంశీచంద్ కార్యాలయం తెలిపింది. యాత్రలో భాగంగా ఇన్నేళ్లుగా సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి.. ఇలా అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆదర్శ జిల్లాగా రూపొందించుకోవాలనే లక్ష్యంతో చల్లా వంశీచంద్ పాలమూరు న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు.

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల మీదుగా సాగే ఈ పాదయాత్రలో ప్రతి రోజు ఉదయం 10 కి.మీ., తిరిగి సాయంత్రం 10 కి.మీ. పాటు మొత్తం రోజుకు 20 కి.మీ.ల పాటు చల్లా వంశీచంద్ నడుస్తారు. గ్రామగ్రామాన రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, ఇలా అన్ని వర్గాల వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ పాలమూరు న్యాయయాత్ర సాగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వివిధ కుల సంఘాలు, విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలతో చల్లా వంశీచంద్ సమావేశమవుతారు. పాలమూరు ప్రగతి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై, వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆయా వర్గాల నుంచి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమవుతారు. ప్రతి రోజు పాదయాత్ర ఏ గ్రామంలో ముగుస్తుందో ఆ గ్రామంలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో బస చేయాలని చల్లా వంశీచంద్ నిర్ణయించారు. పాలమూరు పునర్జీవం కోసం పాలమూరు న్యాయయాత్ర పేరుతో 7 నియోజకవర్గాలలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తోడుగా సీడ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి చేపడుతున్న ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, చల్లా అభిమానులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.