Telangana Congress: కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం.. టీపీసీసీ కమిటీల్లో వారికి దక్కని చోటు..!
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీలో పలు కీలక కమిటీలను నియమించింది.. మొత్తం ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది. మరి ఆ కమిటీలేంటి...? ఆ కమిటీల్లో ఎవరెవరున్నారు...? కీలక నేతలు ఎవరెవరికి చోటు దక్కలేదు.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

తెలంగాణ కాంగ్రెస్‌లో ఐదు కమిటీలను కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసింది. 22మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణా చర్యల కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకు మొదటిసారి అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు వీహెచ్, జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్ సహా మరికొందరినీ ఈ కమిటీలో చేర్చింది.
ఇక రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సహా మరికొందరు నేతలున్నారు.
చల్లా వంశీచంద్ రెడ్డి ఛైర్మన్ గా ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్ ఉన్నారు. అదే విధంగా పి.వినయ్ కుమార్ సారథ్యంలో 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని నియమించారు. అందులో సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలూనాయక్ సహా మరికొందరు నేతలున్నారు. ఇక ఆరుగురు సభ్యులతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా మల్లురవి వ్యవహరిస్తారు.
మొత్తంగా… ఈ ఐదు కమిటీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను కూడా ప్రకటించాలని ఏఐసీసీ భావించింది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుండటం… మరోసారి ముఖ్య నేతలతో చర్చల అనంతరం ఆ లిస్ట్ కూడా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం..
అయితే.. కార్యవర్గం ప్రకటన లేకుండా PAC, అడ్వైజరీ కమిటీ.. డీలిమిటేషన్ కమిటీకే పరిమితం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముఖ్యనేతల పేర్లు గల్లంతవ్వడం కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. ప్రచార కమిటీ చైర్మన్ యాష్కీ, ఎంపీ అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చోటు దక్కలేదు.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల నియామకం లేకపోవడంపై కూడా చర్చమొదలైంది. రాజకీయ వ్యవహారాల కమిటీ 22 మందిలో 8 మంది మంత్రుల పేర్లు ప్రస్తావించిన ఏఐసీసీ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మలనాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పేర్లను ప్రస్తావించలేదు.. స్పెషల్ ఇన్వైటీలుగానే మంత్రులున్నారు.. ఇంకా అడ్వైజరీ కమిటీలో కూడా గందరగోళం నెలకొంది. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ మెంబర్ రాములు నాయక్ లాంటి.. కమిషన్ మెంబర్లకి పార్టీ పదవి ఇవ్వడం పై కూడా చర్చ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




