TPCC: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్.. ఎంపిక వెనుక ఇన్ని క్యాలిక్యులేషన్స్

పీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను ఎంపిక చేయడమే కాదు.. పార్టీ నేతలకు ఓ మెసేజ్‌ కూడా పంపింది కాంగ్రెస్ అధిష్టానం. పీసీసీ రేసులో ఎంతో మంది ఉన్నారు. మధుయాష్కి గౌడ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. కాని, మహేష్‌ కుమార్‌ గౌడ్‌నే ఎంపిక చేయడానికి కారణమేంటి? తెలంగాణలో రెండు పవర్‌ సెంటర్స్‌ ఉండకూడదనే మహేష్‌ కుమార్‌ గౌడ్‌ని సెలెక్ట్‌ చేసిందా?

TPCC: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్.. ఎంపిక వెనుక ఇన్ని క్యాలిక్యులేషన్స్
B. Mahesh Kumar GoudImage Credit source: NAGARA GOPAL
Follow us

|

Updated on: Sep 06, 2024 | 6:43 PM

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటి నుంచి నానుతూ వచ్చిన అంశం ఇది. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి.. పీసీసీ చీఫ్‌గా ఎవరుంటారు? ఇదే ప్రశ్న వెంటాడింది. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నియామకంతో క్వశ్చన్‌మార్క్‌కు పుల్‌ స్టాప్‌ పడింది. మహేష్‌ కుమార్‌ గౌడ్.. ఆ పేరులోనే ఉంది ఆయన సామాజికవర్గం ఏంటన్నది. రేవంత్‌ సర్కార్‌ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతపై ఈమధ్య పెద్ద ఎత్తున అనుమానాలొచ్చాయి. ఒకరిద్దరు దీన్నొక సీరియస్ అంశంగా చేయాలని చూశారు. ఎన్నికల ముందు బీసీలకు ఇస్తామన్న సీట్ల విషయంలో ఎలాగూ న్యాయం జరగలేదు.. కనీసం అధికారంలోకి వచ్చిన తరువాతనైనా బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే మహేష్‌ కుమార్‌ గౌడ్‌ని పీసీసీ చీఫ్‌ పదవి వరించినట్లు చెబుతున్నారు. నిజానికి, ఈ పదవికి రెడ్డి సామాజికవర్గ నేతలతో పాటు ఎస్సీ, ఎస్టీ లీడర్లు కూడా గట్టిగానే ప్రయత్నించారు. కాని, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మహేష్‌ కుమార్‌ గౌడ్‌నే ఎంపిక చేసింది.

ఇంతకీ.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌కే ఎందుకు ఇచ్చారు? సీఎం రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పార్టీలో చెప్పుకుంటుంటారు. అయితే.. అంతమాత్రానికే పీసీసీ ఇచ్చారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల దగ్గర మిగతా వారికి ఉన్నంత పలుకుబడి మహేష్‌కుమార్‌ గౌడ్‌కి లేదని చెబుతారు. కాకపోతే.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పనితనం ఏంటో అధిష్టానానికి తెలుసు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన చేస్తున్న పని అధిష్టానం దృష్టిలో పడింది. అంతేకాదు.. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో బీసీల నుంచి ఎన్నో డిమాండ్లు వినిపించాయి. ఆ సమయంలో అందరితో మాట్లాడి, అందరికీ నచ్చజెప్పి, పార్టీకి డ్యామేజ్ జరక్కుండా చేసిన వారిలో మహేష్‌ కుమార్ గౌడ్ కూడా ఒకరు. ఈయనలో అధిష్టానం చూసిన మరో క్వాలిటీ.. సమన్వయం, అందరినీ కలుపుకొని వెళ్లగలిగే తత్వం. దూకుడు స్వభావం లేదు. సీనియర్లకు విలువ ఇస్తారు. అందుకే, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విషయంలో కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్, భట్టి విక్రమార్క నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్ వచ్చింది.

మహేష్‌ కుమార్‌ గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంలో సామాజిక న్యాయంతో పాటు ప్రాంతీయ న్యాయం కూడా చేశారు. దక్షిణ తెలంగాణకు చెందిన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే.. ఉత్తర తెలంగాణ నుంచి మహేష్‌ కుమార్‌ గౌడ్‌కి పీసీసీ చీఫ్‌ ఇచ్చారు. దీంతో పదవుల్లోనూ సమన్యాయం చేసినట్టైంది.

అయితే.. కొత్త పీసీసీ అధ్యక్షుడి ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అన్నిటికంటే ముందు.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి. ఇదే.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ముందున్న అతిపెద్ద టాస్క్. మరో సవాల్‌ ఏంటంటే.. పార్టీలోని సీనియర్లను ఏకతాటిపై నడిపించడం. మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కంటే పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఆ సీనియర్లలో మంత్రులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు. వీళ్లంతా పార్టీ లైన్ ప్రకారమే నడుచుకుంటున్నప్పటికీ.. సీనియర్లను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. పైగా హైలెవెల్‌ కమిటీలు వేయాలి. అందులో, పార్టీ సీనియర్లను నియమించి వారితో పనిచేయించగలగాలి. 2028 నాటి ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలి. ఇవన్నీ మహేష్‌ కుమార్ గౌడ్ ముందున్న సవాళ్లు.

అయితే.. మహేష్‌ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి ఫుల్ సపోర్ట్‌ ఉంది. నిజానికి, ముఖ్యమంత్రి స్థానం, పీసీసీ అధ్యక్ష పదవి రైలు పట్టాల్లాంటివి. ఇద్దరూ సమానంగా వెళ్తేనే పార్టీ, ప్రభుత్వం నడుస్తుంది. ఒకరు మరొకరిని డామినేట్ చేయాలని ప్రయత్నించినా, ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకున్నా.. పార్టీ, ప్రభుత్వం గాడి తప్పే ప్రమాదం ఉంది. ఈ విషయం అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే, సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా ఉండే లీడర్‌నే పీసీసీ చీఫ్‌ను చేశారని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.