AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేములవాడ ఆలయంలో కలకలం.. వరుసగా చనిపోతున్న రాజన్న కోడెలు.. భయాందోళనల్లో భక్తులు!

ఆ దేవదేవుడి వాహనమది.. దేవుడితో పాటు, ఆయన వాహనాన్నే కొలిచే ఓ గొప్ప సాంప్రదాయం కలిగిన క్షేత్రమది. ఆ వాహన మొక్కులతోనే అధికభాగం ఆదాయాన్ని పొందుతున్న ఆలయమది. కానీ, ఆ రాజన్న వాహనమైన కోడెలకే ఇప్పుడిక్కడ రక్షణ లేకుండా పోయింది.

వేములవాడ ఆలయంలో కలకలం.. వరుసగా చనిపోతున్న రాజన్న కోడెలు.. భయాందోళనల్లో భక్తులు!
Vemulawada Temple Cows
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 06, 2024 | 4:44 PM

Share

ఆ దేవదేవుడి వాహనమది.. దేవుడితో పాటు, ఆయన వాహనాన్నే కొలిచే ఓ గొప్ప సాంప్రదాయం కలిగిన క్షేత్రమది. ఆ వాహన మొక్కులతోనే అధికభాగం ఆదాయాన్ని పొందుతున్న ఆలయమది. కానీ, ఆ రాజన్న వాహనమైన కోడెలకే ఇప్పుడిక్కడ రక్షణ లేకుండా పోయింది. ఆ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇప్పుడు కోడెల మృత్యుఘోష వినిపిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఆలయ కోడెలను శివారు ప్రాంతాల్లో పాతిపెట్టడంపై హిందూ ధార్మిక సంఘాలతో పాటు.. భక్తులు మండిపడుతున్నారు.

అపర కైలాసం ఆ రాజన్న సన్నిధిలో ఏం జరుగుతోంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం. ఇక్కడ రెండు గోశాలలను నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ నిర్వహకులు. రెండింటిలో నిత్యం గుళ్లో తిప్పే కోడెల కోసం ఒక గోశాల ఉంటే, కాస్తా అటూ ఇటుగా అనారోగ్యకరంగా ఉన్న గోవులను ఊరి శివార్లలోని మరో గోశాలలో ఉంచుతున్నారు. రాజన్న గుళ్లో నిత్యం రెండు వందల రూపాయలకు ఒక టిక్కెట్ చొప్పున కోడె మొక్కులు భక్తులు చెల్లించుకోవడం ఆనవాయితీ. వాస్తవానికి నెలకు వచ్చే ఐదారు కోట్ల రూపాయల ఆదాయంలో సింహభాగం కోడె మొక్కుల నుంచే అందుతోంది.

కోడెల నిర్వహణ పట్ల మాత్రం రాజన్న ఆలయ సిబ్బంది తీరుపై చాలాకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. పైగా ఆలయానికి తీసుకొచ్చే కోడెల గోశాలలో నిర్వహణ కాస్త బెటర్ గానే కనిపించినా.. ఊరి చివరన ఉన్న గోశాలలో నాసిరక నిర్వహణతో.. పోషకాహార లోపంతో కోడెల మృత్యుగంట తరచూ మోగుతూనే ఉంది.

ఇటీవల మృత్యువాత పడ్డ ఐదు కోడెలను రాజన్న ఆలయ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి మూలవాగు పరిసరాల్లో పాతిపెట్టారు. ఇలా ఇదే మొదటిసారి కాదు.. చివరిసారి అంతకన్నా కాదు. ఈ ఘటనలు పునరావృతం కావడంపై పలుమార్లు విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఫుల్ స్టాప్ మాత్రం పడటంలేదు. దీంతో కోడెమొక్కులకు కొలువైన క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల శీతకన్నుపై హిందూ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజన్న గోశాల వద్ద బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి.

రాజన్న గోశాలలో కోడెలు మత్యువాత పడటం.. పోశకాహార లోపంతో చనిపోతుండటంతో.. రైతులకు గోవులను ఇవ్వాలని ఇక్కడి అధికారుల కమిటీ తీర్మానించింది. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు వారి పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంతో గోవులను అందిచేవారు. అయితే, ఇందులోనూ స్థానిక రైతులు వచ్చి దరఖాస్తు చేసుకున్నా ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఒకవైపు వినిపిస్తుండగా.. మరోవైపు పంపిణీ చేస్తున్న విధానంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా కోడెమొక్కులకు కొలువైన రాజన్న క్షేత్రంలో కోడెల పంపిణీలో ఎలాంటి వివక్షా ఉండదని ప్రకటించినా.. అందుకు భిన్నమైన పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి. వేములవాడలో ఒకవైపు కోడెల నిర్వహణను గాలికొదిలేయడంతో అవి చనిపోతున్నాయని భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..