
గత కొద్ది రోజులుగా చలి నుంచి స్వల్ప ఉపశమనం పొందుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్‌లో వణికించిన చలి తీవ్రత మళ్లీ మొదలుకానుంది. జనవరి 5 నుంచి 12 వరకు రెండో విడత శీతల గాలులు బలంగా వీయనున్నాయని హెచ్చరించారు. రానున్న వారం రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. డిసెంబర్ నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలకు సమానంగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది.
సాధారణంగా ఎండ ప్రభావం ఉండే మధ్యాహ్న సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు కేవలం 25-26 డిగ్రీలకే పరిమితం కావచ్చు. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మేయనుంది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గి వాహనదారులకు ఇబ్బందులు కలగవచ్చు. ఆకాశం పూర్తిగా మబ్బులతో నిండి ఉంటుంది. దీనివల్ల సూర్యరశ్మి తక్కువగా ఉండి రోజంతా చలి వాతావరణం కొనసాగుతుందని బాలాజీ తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా ఉన్ని దుస్తులు ధరించాలి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు పొగమంచు సమయంలో బయటకు రాకపోవడమే మంచిది. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనదారులు ఫాగ్ లైట్లు వాడుతూ, తక్కువ వేగంతో ప్రయాణించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని చలి నుంచి సేఫ్‌గా ఉండండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..