Telangana: వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
అత్యంత నిరుపేదలు.. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. అర్హుల జాబితాను మండల అధికారుల బృందం తనిఖీ చేయాలని ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.

హైదరాబాద్, ఏప్రిల్ 12, 2025: అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని.. అర్హులనే ఎంపిక చేయాలని సీఎం అన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుకు మంజూరైన ఇంటికి అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సీఎం అన్నారు.
అలాగే లబ్ధిదారుకు ఆర్థికపరమైన ఊరట లభించేందుకుగానూ సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.