TTD బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డు.. 18 మంది సభ్యులతో ఏర్పాటు చేయాలని నిర్ణయం
TTD బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. యాదగిరిగుట్టను మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు మంత్రి కొండా సురేఖ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.. ఓసారి లుక్కేయండి.

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఉంటుందని అసెంబ్లీలో చెప్పారు. బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించామన్నారు. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారన్నారు. గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవని.. ఈ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పించిందన్నారు. ఇంకా మెరుగు పరిచేందుకే యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. సమర్థమైన పాలక మండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ దేవదాయశాఖ పరిధిలోకి వస్తాయన్నారు మంత్రి కొండా సురేఖ. వైటీడీ బోర్డు బడ్జెట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని.. బోర్డు ఆధ్వర్యంలో, యాదగిరిగుట్టలో విద్యాసంస్థలను, ఆధ్యాత్మిక పాఠశాలలను నెలకొల్పి, నిర్వహించొచ్చని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.